Chandrababu Case :  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. గురువారం ఉదయం కోర్టు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.  ఏసీబీ కోర్టులో సిద్దార్ధ లూథ్రా, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి  వాదనలు వినిపించారు.  చంద్రబాబు తరపున లాయర్‌ సిద్దార్ధ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది.NSG భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు.ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును కస్టడీకి కోరుతున్నారు. చంద్రబాబుకు పోలీసు కస్టడీ అవసరం లేదు.నాలుగేళ్లుగా ఎవరినీ అరెస్టు చేసినా... నిధులు దుర్వినియోగం పేరే చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగింది. ఏసీబీ విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేక పోయారు’’ అని సిద్దార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు.


ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీ కి ఇవ్వాలని కోరుతూ ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి.కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును మరోసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసులో ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది’’ అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మంగళవారం పూర్తయింది.  గురువారంతర్పు ఇచ్చేఅవకాశం ఉంది. మంగళవారం హైకోర్టులో జరిగిన  వాదనల్లో  ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ,  రంజిత్ కుమార్,  ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూధ్రా వాదించారు. హోరాహోరీగా సాగిన వాదనల్లో కొన్ని కీలక అంశాలను ఇరు పక్షాలు లెవనెత్తాయి. ఇది పూర్తిగా రాజకీయ  కుట్ర తో పెట్టిన కేసు అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. పలు ఉదాహరణలు చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదన్నారు. పైగా అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో చేశారని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. అరెస్ట్ చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్నారు. ఈ సందర్భంగా పలు కేసులను హరీష్ సార్వే న్యాయమూర్తికి వివరించారు. అర్నాబ్ గోస్వామితో పాటు రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనూ వివరించారు. 


మరో వైపు ప్రభుత్వం తరపు లాయర్లు   చంద్రబాబును అరెస్ట్ చేసి పది రోజులే అయిందని ఇంకా దర్యాప్తు జరుగుతోందని వాదించారు. స్కిల్ కాంట్రాక్టు పొందిన డిజైన్ టెక్.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని వారు నిధులు దారి మళ్లించారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయూమూర్తి  ఆ సబ్ కాంట్రాక్టర్లతో పిటిషనర్‌కు అంటే.. చంద్రబాబుకు సంబంధం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. దీనికి నేరుగా సమాధానం చెప్పలేకపోయిన ప్రభుత్వ లాయర్ రంజిత్ కుమార్.. వేరే కేసులో చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసుల్ని చూపించారు. తీర్పు ను బట్టి.. తదుపరి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.