Jagan Viral Fever :  ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్  ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేశారు. కేబినెట్  భేటీ సమయంలోనే సీఎం జగన్ కాస్త డల్ గా ఉన్నారని అంటున్నారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. వైద్యుల సలహా మేరకు మెడికేషన్ ప్రారంభించి.. కాస్త విశ్రాంతి తీసుకోాలని సూచించారు. ఈ కారణంగానే అపాయింట్‌మెంట్లను రద్దు చేశారు. 


గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతీ రోజూ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు.  చంద్రబాబు హయాలో జరిగిన స్కాముల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. వాటిపైనా కసరత్తు చేయాల్సి ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల లండన్ కు పది రోజుల పాటు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారని...  అందు వల్ల జ్వరం  వచ్చినట్లుగా తెలుస్తోంది.                                       


అంతకు ముందుకు కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో ముచ్చటించారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పాలన చేద్దామని మంత్రులకు చెప్పారు.  దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. విశాఖలో రుషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ ను  నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా.. సీఎం జగన్ తాను అక్టోబర్ నుంచే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు  కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. 


కొన్ని కార్యాలయాలను కూడా తలించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ సూచనల మేరకు కార్యాలయాలను తరలిస్తామని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. అయితే కార్యాలయాలను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కాకుండా... సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ను విశాఖలో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఆఫీసుల్ని మాత్రం విసాఖకు తరలించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.   ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  సిద్దంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.  జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని సహచరులకు సూచించారు.