Davos WEF Meeting : ప్రతీ ఏడాది జనవరిలో  స్విట్జర్లాండ్‌ దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీల యజమానులు, దాదాపుగా ప్రపంచంలోని ప్రముఖ దేశాల పాలకులు అందరూ హాజరవుతూ ఉంటారు. అక్కడ తమ దేశాలు, రాష్ట్రాల గురించి ప్రత్యేక  పెవిలియన్లు ఏర్పాటు చేసి పెట్టుబడిదారుల వద్ద ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. గత ఏడాది ఏపీ సీఎం జగన్ కూడా వెళ్లారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతీ ఏడాది ప్రత్యేక  ప్రతినిధి  బృందంతో వెళ్తూంటారు. ఈ సారి కేటీఆర్ వెళ్లారు కానీ ఏపీ నుంచి ఎలాంటి ప్రతినిధి బృందం వెళ్లలేదు. 


దావోస్‌కు కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక  బృందం !


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) 2023 వార్షిక సదస్సుకు కేటీఆర్‌ నాయకత్వంలోని బృందం వెళ్లింది. కేటీఆర్  వెంట ఐటీ, పరిశ్రమలు ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు కొణతం దిలీప్‌, శక్తినాగప్పన్‌లు ఉన్నారు. ఈసారి సదస్సులో తెలంగాణ ప్రగతిపై కీలకోపన్యాసం ఇవ్వడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో ఆయన భేటీ కానున్నారు. వివిధ ప్యానెళ్ల చర్చాగోష్టుల్లో పాల్గొననున్నారు. భారత్‌లో అత్యంత వేగవంతంగా పురోగమిస్తున్న అంకుర రాష్ట్రంగా తెలంగాణను ప్రపంచ ఆర్థిక వేదిక సద్సులో పరిచయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.  


ఏపీ నుంచి ఈ సారి వెళ్లని ప్రతినిధి బృందం !


టీడీపీ హయాంలో ప్రతీ ఏడాది దావోస్‌కు ప్రతి ఏడాది ప్రతినిధి బృందం  వెళ్లేది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా వెళ్లేవారు. అయితే వైఎస్ఆర్‌సీపీ వచ్చిన తర్వాత దావోస్ పెట్టుబడుల సదస్సును అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ గత ఏడాది మాత్రం జగన్ ప్రత్యేకంగా బృందంతో వెళ్లారు. పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నామని.. ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల సదస్సు తర్వాత జగన్ వారం రోజుల పాటు వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లి  ఏపీకి తిరిగి వచ్చారు. 


గత సదస్సులో ఏపీకి రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు.. !


గత ఏడాది దావోస్ పర్యటనలో సీఎం జగన్ లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో  దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో 1.25 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.  గ్రీన్ ఎనర్జీకు సంబంధించి 1 లక్షా 25 వల కోట్లు రూపాయలు పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో ఒప్పందం పూర్తయింది. పంప్డ్ స్టోరేజ్ వంటి వినూత్న విధానాలతో 27 వేల 7 వందల మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులో రానుంది.  
 
పెట్టుబడులు ఆకర్షించడానికి మంచి అవకాశం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు !


ఏపీ ప్రభుత్వం త్వరలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రముఖుల్ని ఆహ్వానించాలని అనుకుంటోంది.  సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, దేశంలోని వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.  ముఖ్యంగా ఇన్వెస్టర్లను తరలి రావాలని కోరుతోంది. ఇలాంటి సమయంలో... ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్లినట్లయితే.. అక్కడే అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానం ఇచ్చినట్లు ఉండేదన్న వాదన పారిశ్రామిక వర్గాల్లో వినిపిస్తోంది.