గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా ఊబకాయం వల్ల వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రపంచంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయాన్ని ఒకటిగా లెక్కించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఇద్దరిలో ఒకరు బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బరువు పెరగడానికి ముఖ్య కారణం జంక్ ఫుడ్, చెడు జీవనశైలి. బరువు పెరగడం వల్ల తీవ్రమైన సమస్యలు త్వరగా వస్తాయి. బరువు పెరగకుండా ఉండడానికి సరైన ఆహారాన్ని తీసుకుంటూ, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా కూడా వ్యాయామంతో పాటు తాజా ఆహారం అవసరం. కొన్ని రకాల కూరగాయలు కూడా బరువు తగ్గేందుకు, బరువు పెరగకుండా కాపాడేందుకు సహకరిస్తాయి. వాటిల్లో ఒకటి క్యాబేజీ. క్యాబేజీ బరువును పెంచదు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో అవసర పడతాయి.


క్యాబేజీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో మొదటి స్థానంలో ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలేట్, నియాసిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. క్యాబేజీని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోకుండా సహాయపడుతుంది. అంతేకాదు ముఖ్యంగా క్యాబేజీని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.


బరువు తగ్గడం ఎలా?
క్యాబేజీని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ముఖ్యంగా ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అధ్యయనం ప్రకారం 100 గ్రాముల క్యాబేజీలో దాదాపు 25 క్యాలరీలు ఉంటాయి. దీనిలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తినడం వల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దానివల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా మీకు తెలియకుండానే ఆహారం తినడం తగ్గిస్తారు. క్యాబేజీలో ఉండే పీచు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గేలా చేస్తుంది. దీనిలో గ్లూటామైన్ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. దీని వల్ల కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. క్యాబేజీలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేందుకు ఇది చాలా సహకరిస్తుంది.


ఎలా తినాలి?
మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నా లేక బరువు పెరగకూడదు అనుకుంటున్నా క్యాబేజీని వారానికి రెండు నుంచి మూడుసార్లు తినాలి. నూనెలో ఫ్రై చేసుకుని తినడం వల్ల ఉపయోగం ఉండదు. క్యాబేజీ రసాన్ని తాగడం లేదా సూప్‌లా చేసుకోవడం లేదా నీళ్లలో ఉడికించి కూరలా చేసుకుని తింటే మంచిది. కాకపోతే క్యాబేజీ శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీనిలో కంటికి కనిపించని కీటకాలు ఉంటాయి.  ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. 


Also read: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు శెనగపప్పును దూరం పెట్టాల్సిందే

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.