AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేకుండా చూడాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం రూ. మూడు వేల కోట్ల ను కేటాయించింది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు రకాల సమస్యలను నేతల దృష్టికి తీసుకు వస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి పనులు జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి సచివాలయానికి రూ. ఇరవై లక్షలు
ప్రభుత్వానికి ఈ విషయం విజ్ఞాపనలు చేయడంతో ప్రతి సచివాలయానికి రూ. ఇరవై లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ రెండు సార్లు జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు అదనంగా రూ. రెండు కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు సచివాలయం ప్రాతిపదికిన నిధులు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 15,004 సచివాలయాలకు నిధుల మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల మంజూరు చేయడం వల్ల నేతలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ దృష్టికి వచ్చే సమస్యలను ఎక్కడిక్కకడ పరిష్కరించడానికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలని నిర్ణయం
అభివృద్ధి పనులకు నిధుల్లేవని ప్రజాప్రతినిధులు కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ అంతర్గత సమావేశాలతో పాటు పలు కార్యక్రమాల్లోనూ ఈ అసంతృప్తి బయటపడింది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి బిల్లులను చెల్లించడంతో పాటు సచివాలయానికి రూ. ఇరవై లక్షల నిధులు మంజూరు చేయడంతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలు చెప్పిన సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి డిమాండ్లు పెరగడంతో నిర్ణయం
ప్రస్తుతం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ నేతలందరూ నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అందులో నిరసన వ్యక్తం కావడంతో ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ సమస్యను పరిష్కరించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ... గ్రామాల్లో.. పట్టణాల్లో ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో అందర్నీ కొత్త వారిని ఉద్యోగులుగా నియమించింది. ఇటీవలే వారికి ప్రొబేషన్ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా తీసుకున్నారు. ఇప్పుడు ఆ సచివాలయాలు మరింత యాక్టివ్‌గా పని చేసేలా చూస్తున్నారు.