మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే వాళ్లిద్దరికీ కొడుకు ఉన్నాడు. ఆ బాలుడిని చూసుకోవడానికి మరో పెళ్లి చేసుకున్నాడతను. ఆమెకు కూడా ఓ పాప, బాబు పుట్టారు. ఇప్పుడు అతనికి ముగ్గురు పిల్లలు. ఈ కారణంగానే రెండో భార్యతో గొడవలు మొదలయ్యాయి. నిత్యం నింట్లో ఒకటే తగాదాలు.  


భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆ భార్య తనకు పుట్టిన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటూనే జీవనం సాగిస్తోంది. ఇదే ఛాన్స్ అనున్నాడో ఏమో ఆ వ్యక్తి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కూడా ఇది రెండో పెళ్లి. వీళ్లిద్దరికి పాప, బాబు పుట్టారు. 


మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ సంసారం కూడా సరిగా లేదు. వాళ్లిద్దరి మధ్య కూడా నిత్యం తగాదాలే. మూడో పెళ్లాంపై అనుమానంతో నిత్యం ఆమెను వేధించేవాడు. దీని కారణంగానే మూడో భార్యతోనూ మంచిగా ఉండలేకపోయాడా వ్యక్తి. అలా భార్యతో గొడవ కారణంగా ఆ కోపాన్ని పసిబిడ్డలపై చూపించాడు. ఇద్దరి చిన్నారుల గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 


నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓంకార్‌ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఓంకార్, మహేశ్వరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. బుధవారం రోజు నాగర్ కర్నూల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి భార్యా, పిల్లలను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలోనే దంపతులకు గొడవ జరిగింది. భార్యని చంపేస్తానని ఓంకార్ బెదిరించడంతో.. మహేశ్వరి బండి పైనుంచి దూకేసింది. అయితే ఆవేశంలో ఉన్న ఓంకార్ బండి ఆపకుండానే వెళ్లిపోయాడు. 


పిల్లల గొంతు కోసి.. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం!


కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని సమీపంలోని పొలం వద్ద వదిలేసి పిల్లలను గుట్టపైకి తీసుకుపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆపై పిల్లలను అక్కడే వదిలేసి గుట్ట దిగుతూ.. తానూ గొంతు కోసుకున్నాడు. అలాగే నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. 


బండి పైనుంచి దూకిన మహేశ్వరి పెద్ద కొత్తపల్లి ఠాణాలో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇద్దరు పిల్లలను చంపేస్తానని తీసుకెళ్లాడని వివరించింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓంకార్ చరవాణి లొకేషన్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. అక్కడికి మహేశ్వరితో సహా వెళ్లగా.. రోడ్డుపై భర్త రక్తపు మడుగులో కనిపించాడు. అతడిని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి అక్కడి నుంచి మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి..


గుట్టపైకి ఎక్కి చుడగా.. పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలం వద్దే కత్తి కూడా దొరికింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన మహేశ్వరి గుండెలవిసేలా రోదించింది. అది చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టారు.