CM Jagan Case: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ హౌసింగ్ బోర్డుకు చెందిన కేసు నుంచి తమను తప్పించాలంటూ వైసీపీ ఎమ్మేల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. నిందితులపై సీబీఐ చేసిన ఆరోపణలను ప్రాథమిక దశలో తోసి పుచ్చలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. కింది కోర్టులో విచారణకు ఎలాంటి సమాచారం లేదని చెప్పలేమని అన్నారు. అలాగే సీబీఐ అభియోగ పత్రంలోని అంశాలను పరిశీలించాక ఈ నిర్ణయానికి రాలేరని, విచారణలోనే తేలాలని పేర్కొన్నారు. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసిన కుట్రలో ఒకరి పాత్ర ఉన్నా విచారణ చేయవచ్చని, మిగిలిన వారి పాత్ర ఉందా లేదా అన్నది విచారణలో సమర్పించే సాక్ష్యాల ఆధారంగా తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను వెల్లడించారు. కేసును కొట్టి వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన మరీ ముందస్తు చర్య అవుతుందని, ఈ దశలో అలాంటి చర్య తీసుకోలేమని వివరించారు.
సీఆర్పీసీ 482 కింద విచక్షణా అధికారితో ప్రత్యేక సందర్భాల్లోనే కేసును కొట్టివేస్తుందని, ఇక్కడ సీబీఐ ఆరోపణల నేపథ్యంలో ఈ కోర్టు కేసును కొట్టివేయడం లేదని అన్నారు. ఈ కేసులో సీబీఐ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు కాదన్నారు. ఈ దశలోనే అభియోగ పత్రంలోని కేసును తేల్చలేమని ఇది కింది కోర్టు విచారణలోనే తేలాలని స్పష్టం చేశారు.
అసలు జరిగిందేంటంటే..?
ఇందూ హౌసింగ్ బోర్టుకు చెందిన ప్రాజెక్టుతో కృష్ణ ప్రసాద్ కు 50 శాతం వాటా ఉన్న వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గచ్చిబౌలిలోని 4.23 ఎకరాల్లో హౌసింగ్ ప్రాజెక్టు నిమిత్తం ఎస్వీవీగా ఒప్పందం కుదుర్చుకుందని సీబీఐ ఆరోపిస్తుంది. ఎంబసీ యూనిటీ కన్సార్షియంలో సభ్యులుగా పేర్కొంటూ వసంత ప్రాజెక్ట్స్ హౌసింగ్ బోర్డుతో అభివృద్ధి అగ్రిమెంట్ చేసుకుందని తెలిపింది. ఈ నేరకు కృష్ణ ప్రసాద్ మూడు విల్లాలను పొందడంతో పాటు ప్రాజెక్టులో మిగిలిన వాటిని బంధువులు, సన్నిహితులకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని పేర్కొంది. విలాస వంతమైన విల్లాలను పూర్తి చేసి ఎల్ఐజీ యూనిట్లను పట్టించుకోలేదని, ఇది ఒప్పందానికి విరుద్ధమని సీబీఐ వెల్లడించింది. వసంత ప్రాజెక్ట్స్ లో 50 శాతం వాటా ఉన్న వై.ఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి కారణంగానే ఇందూ శ్యాం ప్రసాద్ రెడ్డికి హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులు దక్కాయని స్పష్టం చేసింది.
వై.ఎస్ సన్నిహితుడైన శ్యాంప్రసాద్ రెడ్డికి ఇందూ ప్రాజెక్స్ట్ కు శంషాబాద్ వద్ద ఇందూ టెక్ జోన్ పేరుతో 250 ఎకరాలు, అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాలు కేటాయించడంతో పాటు కూకట్ పల్లి బండ్లగూడ, గచ్చిబౌలి, నంద్యాలల్లో బౌసింగ్ ప్రాజెక్టులను అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా ఇందూ గ్రూపు వై.ఎస్. జగన్ కు కంపెనీల్లోరూ.70 కోట్ల ముడుపులను పెట్టుబడులుగా చెల్లించినట్లు సీబీఐ ఆరోపణల్లో తెలిపింది.