మాండస్ తుపాను తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారి.. ఆ తర్వాత శనివారం (డిసెంబరు 10) సాయంత్రానికి అల్ప పీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ అధికారులు అంచనా వేశారు. రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్‌ శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన సంగతి తెలిసిందే.


‘‘మోస్తరు నుంచి భారీ వర్షాలు గుంటూరు, కొనసీమ​, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు ఉదయం వరకు కొనసాగనున్నాయి. అలాగే విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం జిల్లాతో పాటుగా తూర్పు తెలంగాణ భాగాలైన నల్గొండ​, సూర్యాపేట జిల్లాలతో పాటుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నేడు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.


ఈ మాండోస్ తుఫాను ప్రభావం అసలు నేడు కూడా తగ్గే లాగా లేదు. గతంలో చెప్పిన విధంగా ఈ మాండోస్ తుఫాను ప్రభావం డిసెంబరు 13 వరకు కొనసాగనుంది. నిన్న తెల్లవారిజామున నుంచి రాయలసీమ లోపల భాగాలైన అనంతపురం, అన్నమయ్య​, సత్యసాయి, కర్నూలు, నంధ్యాల​, చిత్తూరు పశ్చిమ ప్రాంతాలు, కడప జిల్లాల్లో విస్తారంగా పడ్డాయి. అలాగే డిసెంబరులో వచ్చిన తుపాను కాబట్టి చలి తీవ్రత కూడా తారా స్ధాయిలో ఉంది. నేడు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండనుంది. కొన్ని వాగులు వంకలు అనంతపురం జిల్లాలో పొంగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోగలరు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తుపాను ప్రభావం తెలంగాణపై చాలా స్వల్పంగా ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్‌లో వాతావరణం ముసురు పట్టి ఉంటుంది. నగరంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.