irrigation projects in andhra pradesh 2022 : జల యజ్ఞం అనేది వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యతాంశాల్లో ఒకటి. అందుకే ప్రాజెక్టుల గురించి ఎక్కువగా ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. పోలవరం సహా.. 34 ప్రాజెక్టులను ప్రాధాన్యతపరంగా తీసుకున్నారు. మరి వాటిలో ఎంత మేరకు పూర్తయ్యాయి. ఎన్ని పనులు జరిగాయి ? ఈ ఏడాది సాగునీటి రంగానికి స్వర్ణయుగమేనా ఇప్పుడు చూద్దాం. 


ఈ ఏడాది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ఇవీ !


2022లో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్య క్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. వీటితో పాటు కొత్త  ప్రాజెక్టులు రూ.72,458 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రచించారు. వాటిలో సింహభాగం టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఆ ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఎర్రబల్లి ఎత్తిపోతల, రాజోలి జలాశయం, రాజోలిబండ మళ్లింపు పథకం, గాలేరునగరి రెండో దశ కోడూరు వరకు నీటి మళ్లింపు, గాలేరు నగరి-హంద్రీనీవా ఎత్తిపోతల పనులు శరవేగంగా జరగాల్సి ఉంది.  వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం ప్రాంతంలో ఐదు ఎత్తిపోతలలు, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకం, వరికపూడిశిల ఎత్తిపోతల, జీడిపల్లి-కుందుర్పి పథకం, మడకశిర బైపాస్‌ కాలువ పథకాల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వీటిలో ఏ ప్రాజెక్టు పనులూ ప్రారంభం కాలేదు. టెండర్ల వద్దే చాలా ఆగిపోయాయి. 


ప్రారంభమైన నెల్లూరు, సంగం బ్యారేజీలు 


నెల్లూరు, సంగం బ్యారేజి నిర్మాణాలు పూర్తయ్యాయి. సీఎం జగన్ వాటిని ప్రారంభించారు.  నెల్లూరు బ్యారేజికి రూ.94 కోట్లు, సంగం బ్యారేజికి రూ.64 కోట్లు వెచ్చిస్తే ఆ రెండు ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయవచ్చని 2019 నవంబరులోనే ప్రణాళిక రూపొందించారు. ఇవి మూడున్నరేళ్లకు పూర్తయ్యాయి.  


పోలవరం ఎక్కడిదక్కడే !


2019లో అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మేఘాకు అప్పగించారు. కొత్తలో.. 2020 ఖరీ్‌ఫనాటికి పోలవరాన్ని పూర్తిచేస్తామని అసెంబ్లీ వేదికగా జగన్‌ వెల్లడించారు. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మళ్లీ సభలోనే చర్చకు వచ్చినప్పుడు.. 2021 డిసెంబరు నాటికి పూర్తిచేసి చూపిస్తామని జల వనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ సవాల్‌ చేశారు. అదీ పోయింది. ఇప్పుడు పోలవరంపై మంత్రి అంబటి రాంబాబు.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేశారు. ఈ ఏడాది పోలవరం పనులు అసలు సాగలేదు. 


పోలవరం కాకుండా 42 ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తింపు 


2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం  నవంబరు నాటికి రూపుదిద్దుకున్న ప్రణాళిక ప్రకారం.. అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో 25శాతంలోపు మాత్రమే పనయిన వాటిల్లో ఏవి అవసరమో అధ్యయనం చేసి కొన్నింటిని రద్దు చేశారు. ఆ ప్రక్రియ తర్వాత పోలవరం కాకుండా 42 ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉందని గుర్తించారు. ఇందుకు రూ.24,092 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రాధాన్య జాబితాలో చేర్చడం కాకుండా వాటికి నిధులిచ్చి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జలవనరుల శాఖలో రూ.11,482 కోట్లు వెచ్చించాలని అంచనాగా రూపొందించారు. కానీ ప్రాజెక్టులకు సంబంధించిన ఉద్యోగుల జీతభత్యాలకు తప్ప ఇతర నిధులు విడుదల చేయకపోవడంతో అత్యధిక వాటిలో పనులు జరగడంలేదు. నిజానికి గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.1,078 కోట్లు వెచ్చించి ఐదు ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్న చిన్న ప్రణాళికే ఇంతవరకు అమలు చేయలేకపోయారు. 


 కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు 


 కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు అవసరమన్న లెక్కలున్న నేపథ్యంలో ఈ స్థాయి ఖర్చుతో ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయన్నది పెద్ద ప్రశ్నే. ప్రాజెక్టులు ఆలస్యమయ్యే కొద్దీ అంచనా ధరలు, నిర్మాణ వ్యయం పెరిగిపోతూ వస్తోంది. నిధులు వెచ్చించి, పనుల వేగం పెంచి ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తూ వెళ్లే ప్రయత్నం జరగడం లేదు.   2024లోపు మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనేది ప్రణాళిక వేసినా ఈ ఏడాది  కొలిక్కి వచ్చినవి నెల్లూరు, సంగం బ్యారేజిలు మాత్రమే.40పాత ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పటికి పూర్తి చేయగలరో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు.


ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడిన నిధుల సమస్య 


అధికారిక లెక్కల  ప్రకారం సాగునీటి రంగంలో ప్రాజెక్టులపై మూడేళ్లలో వెచ్చించింది రూ.15,393 కోట్లు. ఇందులో పోలవరం కోసం చేసిన ఖర్చు కూడా కలిపి ఉంది. పోలవరంతోసహా పాత ప్రాజెక్టుల పూర్తికి రూ.54 వేల కోట్లు అవసరం. కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టులకు మరో రూ.72 వేల కోట్లు అవసరం. అంతంతే కేటాయిస్తున్న నిధులతో ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తయ్యేనన్న చర్చ సాగుతోంది.  


మొత్తంగా చెప్పాలంటే.. ఏపీ సాగునీటి రంగంలో ఈ ఏడాది పెద్దగా ఎలాంటి పురోగతి లేదని చెప్పుకోవచ్చు.