Andhra Teachers APP Problems : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోధనేతర విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా టీచర్ల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ విషయంలో మ్యాన్ పవర్ అవసరమైనా టీచర్ల వైపే చూస్తుంది. వారికి అనేక రకాల విధులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం తొలగించింది. ఎంత వరకూ అమలు చేస్తారో అన్నదానిపై స్పష్టత లేదు .. ఎందుకంటే.. అత్యవసరమైతే వాడుకోవచ్చు అన్న క్లాజ్ ఆ నిబంధనల్లో ఉంది. అయితే ఉపాధ్యాయులు.. బోధన చెప్పడానికి సమయం లేకుండా చేస్తున్న యాప్‌ల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. యాప్‌ల సమస్యలను  పరిష్కరించాలంటున్నారు. అసలు ఈ యాప్‌లు ఏంటి ? టీచర్లు ఎందుకు ఈ యాప్‌ల సమస్యను ఎక్కువగా చెబుతున్నారు?


టీచర్లకు గుదిండబల్లా యాప్‌లు !
 
ఉపాధ్యాయులకు బోధనేతర పనులను మినహాయింపు పేరిట ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో యాప్‌లనూ చేర్చాలన్న డిమాండ్‌ను టీచర్లు చేస్తున్నారు.  తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న యాప్‌లను కొనసాగించవద్దని కోరుతున్నాు. పాఠశాల విద్యలో ఉన్న యాప్‌లు ఏ శాఖలోనూ లేవు. బడికెళ్లగానే ముఖ ఆధారిత హాజరు నుండి విద్యార్థుల హాజరు, మానిటరింగ్‌, మధ్యాహ్నం భోజనం, నాడు-నేడు పనులు, కోడిగుడ్ల సైజులు చూసుకోవడం, బియ్యం లెక్కలు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం, విద్యా కానుక కిట్ల పంపిణీ వంటి పనులను అప్పగించింది. వీటికోసం 32 రకాల యాప్‌లను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఇందులో 16 యాప్‌లలో ప్రతి రోజూ ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. సర్వర్లు, నెట్‌వర్క్‌ సమస్య వల్ల యాప్‌లో సమాచారం నమోదు చేయని వారికి కూడా విద్యాశాఖ షోకాజ్‌ నోటీసు ఇస్తోంది. దీంతో బోధన కంటే యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.


యాప్‌లలో అప్‌లోడ్ కోసం మూడు, నాలుగు గంటల సమయం !


ప్రతీ టీచర్ విధుల్లోకి వచ్చిన తర్వాత పదహారు రకాల యాప్‌లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటి వల్ల కనీసం మూడు గంటల సమయం వృధా అవుతోందని అంటున్నారు. అదీ కూడా నెట్ వర్క్ బాగా ఉన్న చోటనే. ఎక్కడైనా నెట్ వర్క్ సరిగ్గా లేకపోతే ... ఇక ఆ యాప్‌లతో కుస్తీ పట్టడమే సరిపోతుంది. ప్రభుత్వం ఇష్టారీతిగా రుద్దిన యాప్‌ల వల్ల ప్రతిరోజూ భారాన్ని మోయాల్సివస్తోందని వాటి భారాన్ని తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వాటిని తగ్గిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యనందించడానికి వీలవుతుందని అంటున్నారు. 


స్కూల్స్ సెలవుల సమయాల్లో జరిగే జనగణన, ఎన్నికలు !


బోధనేతర విధులు స్కూల్స్ లేని సమయంలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 'జనగణన',  'ఎన్నికలు' వంటివి  సెలవుల సమయంలోనే పెడతారు. వాటి నుంచి మినహాయింపునివ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.  యాప్  పనులకు మినహాయింపు ఇవ్వకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బడిలో బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.  పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకు యాప్‌లతో బోధనేతర పనులను పాఠశాల విద్యాశాఖ రోజు ఉపాధ్యాయులకు అప్పగించకుండా చూడాలంటున్నారు. 


ప్రభుత్వం టీచర్ల గోడు ఆలకిస్తుందా ?


టీచర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నందునే.. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడానికే..  బోధనేతర విధుల నుంచి మినహాయిపునస్తూ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వ్సతున్నాయి. అలా కాదు.. నిజంగానే టీచర్ల సమస్యలను గుర్తించామని వారికి బోధన విధులు మాత్రమే ఉంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పదల్చుకుంటే.. యాప్‌ల విధులను తక్షణం తొలగించాలని కోరుతున్నారు. లేకపోతే.. ఎన్నికల విధులకు దూరం చేయడానికే నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి వస్తుందంటున్నారు. మరి ప్రభుత్వం వీరి మొరను ఆలకిస్తుందా ?