Buddha Venkanna Anointing With His Blood to Chandrababu's Photo: టీడీపీ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) పార్టీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. రక్తంతో ఫ్లెక్సీలోని చంద్రబాబు కాళ్లు కడిగారు. అలాగే, 'చంద్రబాబు జిందాబాద్.. నా ప్రాణం మీరే' అంటూ గోడలపై రక్తంతో రాశారు. ఇది నిరసన కాదని.. చంద్రబాబుపై తనకున్న అభిమానం వల్లే ఇలా చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తనకు పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకు కేటాయించాలని మరోసారి మనవి చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని నిరసన దీక్షగా చిత్రీకరించవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. కాగా, జనసేనతో పొత్తుల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న ఆ సీటు కోసం పట్టుబడుతున్నారు.



'విధేయులకు ప్రాధాన్యత ఇవ్వాలి'


'చంద్రబాబు నాకు విజయవాడ నగర బాధ్యతలు అప్పగిస్తే 6 ఏళ్లు పని చేశాను. 3 జిల్లాలకు ఇంఛార్జీగా చంద్రబాబు నన్ను నియమిస్తే ఆ బాధ్యతలూ చిత్తశుద్ధితో నిర్వర్తించాను. చంద్రబాబుపై దాడి జరిగితే ఎవరూ మాట్లాడలేదు. నేను పోరాటం చేశాను. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లోనూ ఐవీఆర్ నిర్వహిస్తున్నారు. నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని గతంలో చంద్రబాబుకి, లోకేశ్ కు చెప్పాను. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చోవాలని కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. విధేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.' అని బుద్ధా వెంకన్న అన్నారు.


చంద్రబాబు కుటుంబం తప్ప తనకు వేరే ఎవరూ నాయకులు కాదని.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బుద్దా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలని అన్నారు. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. 'నా ప్రాణం చంద్రబాబు. నా రక్తంతో ఆయన కాళ్లు కడిగి ప్రేమ చూపించాను. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారి టైప్ నేను కాదు. నా రక్తం మొత్తం చంద్రబాబే. ఎవరి మీదికైనా దూకే శక్తి, సైన్యం నాకు ఉంది. పార్టీలో ఉండి విన్నా.. వినిపించనట్లుగా నటించే వారు చాలా మంది ఉన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తే ఒక్కరు మాట్లాడరు. చంద్రబాబు ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా సీబీఎన్ జిందాబాద్ అని మాత్రమే అంటాను. ఇది పూర్తిగా అభిమానమే.. బ్లాక్ మెయిలింగ్ కాదు. ఇక నా పని తీరు, స్వామి భక్తి ఎలా నిరూపించుకోవాలి.? నాకు సీటు ఇచ్చి చట్ట సభల్లో అడుగు పెట్టించాలని కోరుతున్నా. ఇది నా విన్నపం.. విజ్ఞప్తి మాత్రమే. నాలో ఊపిరి ఉన్నంతవరకూ చంద్రబాబు కుటుంబంతోనే నా ప్రయాణం.' అని బుద్ధా వెంకన్న స్ఫష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.


Also Read: Tirumala Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల తేదీలివే!