Lokesh Selfie At Rushikonda: శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి వరకు భీమిలిలో సభ నిర్వహించిన ఆయన అనంతరం విశాఖ నగరానికి వచ్చే క్రమంలో రుషికొండ వద్ద ఆగారు. ఈ కొండకు గుండు కొట్టి.. సీఎం జగన్మోహన్‌రెడ్డి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారంటూ లోకేష్ అక్కడ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రుషికొండను మింగిన అనకొండ జగన్ అంటూ.. కొండను, అక్కడ కట్టిన భవనాన్ని చూపిస్తూ నారా లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో రుషికొండ వల్ల లోకేష్ ఈ సెల్ఫీలను తీసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
తీవ్ర స్థాయిలో విమర్శలు
రుషికొండను తవ్వి, బంగ్లా కట్టుకున్నాడంటూ జగన్‌పై లోకేష్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. జగన్ పెద్ద అనకొండ అంటూ పేర్కొన్న లోకేష్.. విశాఖ తీర ప్రాంతానికి రక్షణ గోడలా నిలిచిన రుషికొండను నాశనం చేశాడని విమర్శించారు. జగన్ అనే అవినీతి అనకొండ.. రుషికొండు మింగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నగరాల్లో తొమ్మిది ప్యాలెస్‌లు ఉన్న ఏకైక పెత్తందారుడు జగన్ అని విమర్శించారు. ప్రజాధనం రూ.500 కోట్లతో రుషికొండకు గుండు కొట్టి కట్టిన మరో ప్యాలెస్ చూడండి అంటూ ఈ ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి నువ్వు మింగిన కొండలను, వేల కోట్లను కక్కిస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతకుముందు భీమిలిలో నిర్వహించిన సభలోనూ లోకేష్ తీవ్ర స్థాయిలో సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ కట్టుకున్న ప్యాలెస్‌ను ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా, మెడికల్ డివైస్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు స్పస్టం చేశారు.
నేడు కొనసాగనున్న సభలు
నారా లోకేష్ శంఖారావం సభలు ఆదివారం కూడా జరగనున్నాయి. మొదట తూర్పు నియోజకవర్గం పరిధిలోని అప్పుఘర్‌లో ఒక సభను నిర్వహించనున్నారు. ఇది ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలు తరువాత దక్షిణ నియోజకవర్గం పరిధిలో మరో సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు సభల్లోనూ లోకేష్ ప్రసంగించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, వైసీపీ అవినీతి వ్యవహారాలపై లోకేష్ ఈ సభల్లో ద్వజమెత్తే అవకాశముంది.