Medaram Trains: తెలంగాణ(Telangana) కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు జనం పోటెత్తుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర(Jathara)గా పేరుగాంచిన ఈ వనజాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీలతోపాటు , తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున సాధారణ భక్తులు సైతం లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను(TS RTC) నడుపుతోంది. భక్తులు సైతం వేలాదిగా ప్రైవేట్ వాహనానాల్లో అమ్మవార్ల దర్శనానికి వస్తున్నా...లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఏమాత్రం రవాణా సౌకర్యాలు సరిపోవడం లేదు. ఇంకా చాలామందికి మేడారం వెళ్లాలని ఉన్నా....రవాణాసౌకర్యాలు సరిగా లేకపోవడంతో వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది రైల్వేశాఖ.


మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
మేడారం(Medaram) జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధరణ ప్రజల కోసం 30 ప్రత్యేక జన్ సాదారణ్ రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెళ్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట(Khajipet), వరంగల్(Warangal) మీదుగా నడవనున్నాయి. సికింద్రాబాద్(Secunderabad), నిజామాబాద్(Nizamabad), ఆదిలాబాద్(Adilabad), సిర్పూర్ కాగజ్ నగర్, ఖమ్మం(Khammam) నుంచి  ప్రారంభంకానున్నాయి. మేడారం జాతర చేరుకునేవారికి, తిరుగు ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతోనే అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.  జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్‌లలో నడవనున్నాయి.


ప్రత్యేక రైళ్ల సమయాలు 
సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు తిరిగి వరంగల్ నుంచి సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్ నగర్- వరంగల్ , వరంగల్- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్- వరంగల్, వరంగల్- నిజామాబాద్ మధ్య 8 రైళ్లు నడపనున్నారు. అలాగే ఆదిలాబాద్-వరంగల్, వరంగల్-ఆదిలాబాద్ మధ్య 2, ఖమ్మం -వరంగల్, వరంగల్-ఖమ్మం మధ్య మరో రెండు రైళ్లు నడవనున్నాయి.


* ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్- వరంగల్ (07014) మధ్య, అదే సమయంలో వరంగల్‌-–సికింద్రాబాద్‌ (07015) మధ్య ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది.


* వరంగల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు  వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్‌ చేరుతుంది. 
22వ తేదీ ఆదిలాబాద్ నుంచి వరంగల్ కు (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్ లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు వరంగల్‌ చేరుతుంది. అలాగే ఈనెల 23న ఖమ్మం నుంచి వరంగల్ (07021)కు వెళ్లే ప్రత్యేక రైలు ఖమ్మంలో ఉదయం 10గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు వరంగల్ కు చేరుతుంది. అలాగే ఈనెల 24న వరంగల్ నుంచి ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటుతోపాటు జాతరకోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.