Palasa Passenger train Accident:


విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద విశాఖ నుంచి పలాస వెళ్తున్న రైలు సిగ్నల్ కోసం ఆగి ఉంది. అదే సమయంలో విశాఖ - రాయగడకు వెళ్తున్న రైలు పలాస వెళ్తున్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు మంది ప్రాణాలు కోల్పోగా , మరో 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 


విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు ను విశాఖ- రాయగడ రైలు ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. గాయపడిన వారికి అండగా నిలవాలని బిజెపి శ్రేణులకు పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. అదేవిధంగా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.


రైలు ప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ – రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదంపై నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమీపంలో తెలుగుదేశం పార్టీ కేడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాల్సిందిగా కోరారు. 


మెరుగైన వైద్యం అందించాలన్న పవన్ కళ్యాణ్ 
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం తనను కలచివేసిందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విశాఖ -పలాస, రాయగడ్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందించాలని, రైల్వే అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనను మరువకముందే మరో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు.


విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం బాధాకరం: కింజరాపు అచ్చెన్నాయుడు
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం బాధాకరం అన్నారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడటం మనసును తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న టీడీపీ కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.