కడప జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ నేతల ప్లెక్సీల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లాంటివి చేయడం లేదని, కేవలం ధరల వివరాలు ప్రజలకు తెలియజేయడంలో తప్పులేదు అంటున్నారు టీడీపీ నేతలు. ఆ ఫ్లెక్సీలను చివరకు మున్సిపల్ సిబ్బంది తొలగించాల్సి వచ్చింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రజల అవసరార్థం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన నిత్యావసరాల ధరల ఫ్లెక్సీలను చించి వేయడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరల పట్టిక వేస్తూ పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలు రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వివాదాలకు దారి తీసే పరిస్థితి ఉందని వాటిని తోలగించాలని పోలీసులు టీడీపీ నేతలను కోరారు. కానీ టీడీపీ నేతలు వాటిని తోలగించకపోవడంతో.. అధికారుల ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను చించి వేసింది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంపై ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు, మున్సిపల్ అధికారులపై మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫ్లెక్సీ లను పెడితే భరిస్తారు... కానీ ప్రజలకు సంబంధించిన ఫ్లెక్సీలను పెడితే మాత్రం డ్యామేజీ వస్తుందా అని బీటెక్ రవి ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేయడం దారుణం అన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో ధరల మార్పులను సూచిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం తప్పుకాదన్నారు. తమకు చెడ్డ పేరు వస్తుందనే వైఎస్సార్‌సీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చి ఫ్లెక్సీలు తొలగించేలా చేశారని ఆయన ఆరోపించారు.
ఫ్లెక్సీల ఏర్పాటుపై పోలీసులు, మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. తమ మిత్రుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి గత కొంతకాలం నుంచి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నాడని, ఇక ఇక్కడ వివాదం జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉందో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. ఒకవేళ అతనికి ఏదైనా జరిగితే వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తాము మర్యాదగా ఉంటున్నామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం వారికోసం పనిచేస్తున్నారని, ఫ్లెక్సీలు చించివేసే ఉద్యోగాలకు ఏమైనా రిక్రూట్ అయ్యారా ఏంటని పోలీసుల తీరుపై బీటెక్ రవి అసహనం వ్యక్తం చేశారు. తాము కూడా విశ్వరూపం చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే కార్యరూపం దాల్చుతామని హెచ్చరించారు.
Also Read: Covid Update: ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!