Chandrababu Bumper Offer To Volunteers: తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని.. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త ఏడాది మొదటి రోజు, ఈ చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్తపుంతలు తొక్కుతూ, మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు కలగాలని.. అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు తీపికబురు అందించారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని ఇంతకు ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేశామని అన్నారు.
'కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి'
'మన దశ, దిశ నిర్దేశించుకునే వేడుక ఉగాది.. కొత్త ఉత్సాహం అందించే పండుగ. తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. ధరలు తగ్గి.. అందరి ఇళ్లల్లోనూ సంక్షేమం నిండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు, పులుపు ఇలా అన్ని రుచులూ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. నేడు రాష్ట్రంలో కారం, చేదులో ఉన్నాయి. అశాంతి, అభద్రతా భావం కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలు, అన్నీ వర్గాలను ఆదుకున్నాం. రాష్ట్రంలో సహజ వనరులన్నీ వైసీపీ హయాంలో దోపిడీకి గురయ్యాయి. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకు రావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలబడాలి.' అని చంద్రబాబు అన్నారు.
పంచాంగ శ్రవణం
రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఎన్నికల్లో 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని.. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారని వెల్లడించారు.
Also Read: Tirupati News: ఐఏఎస్ అధికారి గిరీషాకు కాస్త ఊరట- సస్పెన్షన్ ఎత్తివేత