Question Of Gender: లింగ భేదానికి సంబంధించిన ప్రశ్న?
సద్గురు: ప్రస్తుతం, సమాజం ఆధునికమవుతున్న కొద్దీ, సంస్కృతులు పూర్తిగా “శరీర ఆధారిత సంస్కృతులు” (Body Culture)గా మారుతున్నాయి. శరీరం చాలా ముఖ్యమైపోయింది. మనం పరిణితి చెందుతున్న కొద్దీ, ఇతర అంశాలు మరింత ముఖ్యమైనవిగా మారాలి, కానీ దురదృష్టవశాత్తు, శరీరం చాలా ముఖ్యమైపోయింది. అంతా కేవలం శరీరం గురించే అయి ఉంటోంది. సమాజ నిర్మాణాన్ని ఇంకా మన పిల్లల మనస్సులను - ఒక స్త్రీని లేదా పురుషుడిని చూస్తే, వారు మీకు సుఖాన్ని కలిగించే విషయం అన్న దృక్కోణంలో చూడాలి - అన్నట్టుగా తయారు చేస్తున్నాం. సమాజంలో ఇది మరీ విపరీతం అవుతోంది.
ప్రజలు తమను తాము స్త్రీగానో లేక పురుషుడిగానో కాక, తమను తాము మనుషులుగా చూడాలి. జీవితంలోని కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఆ నిర్దిష్ట పాత్రను పోషించడానికి, పురుషుడిగా లేదా స్త్రీగా ఉండాలి. లైంగికత అనేది మీలో ఒక చిన్న భాగం మాత్రమే. జీవాన్ని ఉన్న దున్నట్లుగా చూస్తే, లైంగికత దానికి తగ్గ స్థానంలో అది ఉంటుంది - జీవితంలో అదొక చిన్న భాగంగా ఉంటుంది. మరీ పెద్ద విషయం అవ్వదు. అది అలానే ఉండాలి కూడా! ప్రతి ప్రాణిలో అది అలానే ఉంటుంది. జంతువులు ఎప్పుడూ దాని గురించే ఆలోచించవు. వాటిలో ఆ కోరిక కలిగినప్పుడు, అది ఉంటుంది, మిగతా సమయంలో ఎవరు మగ, ఎవరు ఆడ అని నిరంతరం ఆలోచించవు. ఆ ఆలోచనలో చిక్కుకున్నది కేవలం మనుషులే.
పురుషుడు లేదా స్త్రీ అన్నప్పుడు… అది, ఒక నిర్దిష్టమైన సహజ ప్రక్రియ కోసం ఉన్న చిన్న శారీరక వ్యత్యాసం మాత్రమే. అన్ని సమయాల్లో, వీధిలో మీరు స్త్రీనా లేక పురుషుడా అన్న పట్టింపు అవసరం లేదు. కొన్ని పరిమిత శరీర భాగాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నట్లయితే, మీరు సహజంగానే ఆ విధంగా వ్యవహరిస్తారు. మనం ఎందుకు ఒక శరీర భాగానికి అంత ప్రాముఖ్యతనిస్తున్నాం? ఏ ఇతర శరీర
భాగానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఏదైనా భాగానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తే మెదడుకు ఇవ్వాలి, జననాంగాలకు కాదు. కాబట్టి 24 గంటలూ పురుషుడు లేదా స్త్రీ పాత్రను పోషించాల్సిన అవసరం లేదు. మీరు పాత్రను పోషించే కొన్ని సందర్భాలు ఉన్నాయి. మిగతా సమయంలో, మీరు ఒక పురుషుడు లేదా స్త్రీగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు స్త్రీగా లేదా పురుషుడిగానే ఉండిపోతే, మీకు ఎప్పటికీ స్వేచ్ఛ ఉండదు.
జీవం భౌతికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే అసలు సమస్య. ఈ భౌతిక శరీరమే అంతిమ సరిహద్దు అని మీరనుకుంటున్నారు. మీ భౌతిక సరిహద్దులు జీవం అంతిమ సరిహద్దులుగా అనుకున్న క్షణం, మీరు మీ శ్వాసను కూడా అనుభూతి చెందలేరు. మిమ్మల్ని సజీవంగా ఉంచుతున్న మూలాన్ని కూడా మీరు అనుభూతి చెందలేరు.
సమాజాలు ఆధ్యాత్మిక భావనతో ఉంటే, అప్పుడు మీరు పురుషుడా లేదా స్త్రీనా అన్నది సమస్య అవ్వదు. ఎందుకంటే పురుషుడు లేదా స్త్రీ అనేది ప్రాధమికంగా భౌతిక శరీరానికి సంబంధించినది. ఆధ్యాత్మికత అనేది తప్పొప్పులు గురించో , లేదా దేవుడి గురించో , లేదా స్వర్గం గురించో కాదు. ఆధ్యాత్మికత అంటే మీరు ఒక తత్వశాస్త్రాన్నో మరొక దాన్నో నమ్మడం గురించి కాదు. ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం భౌతికతను
అధిగమించడమే. మీ జీవితానుభూతి భౌతిక పరిమితులను అధిగమిస్తే, అప్పుడు మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్లు! భౌతికతకు మించినది మీలో సజీవ వాస్తవికతగా మారితే, మీరు మీ భౌతికాన్ని చాలా సులభంగా నిర్వహించవచ్చు.
ఎవరైనా తనను తాను భౌతిక శరీరంగా భావించినంత కాలం, బంధనాల నుంచి తప్పించుకోలేరు. ప్రజలు తమను తాము భౌతిక శరీరానికి అతీతంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరు. ఆధ్యాత్మిక ప్రక్రియ ఇంకా యోగ శాస్త్రం అంతా- మీరు పురుషుడైనా లేక స్త్రీ అయినా, మీ భౌతికతను దాటి మిమ్మల్ని మీరు అనుభూతి చెందడంలో సహాయపడటానికే! అక్కడే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా స్వేచ్ఛగా మారేది, లైంగికంగా స్వేచ్ఛగా మారడం ద్వారా కాదు. మీ లైంగికత నుంచి స్వేచ్ఛ పొందినప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. (It is not by becoming sexually free that someone will become free. If you become free from your sexes, only then you are free)
భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన 50 మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన, విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 400 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘చైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.