MP positions in AP  : నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది.  రెండు విడతలుగా ఢిల్లీలో  జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో , బీజేపీ ఆరు స్థానాల్లో, జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు  జనసేన, ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటేమిటి అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో చర్చించి ఖరారు చేసుకుంటారు. 


ఉదయం పదకొండు గంటల సమయంలో   చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై ప్ర‌ధానంగా చ‌ర్చ కొన‌సాగింది. ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ తర్వాత  అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది.. ఈ నెల 14వ తేదిన జ‌రిగే ఎన్డీఎ స‌మావేశానికి చంద్ర‌బాబును హాజ‌రుకావాల్సిందిగా అమిత్ షో కోరారు.                        


  తమ సర్వే ప్రకారం 25 లోక్‌సభ సీట్లలో కనీసం 23 సీట్లు తెలుగుదేశం-జనసేన-బీజేపీ గెలుచుకుంటుందని బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు, అప్పుల పాలు చేస్తున్న వైనం తమకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. జగన్‌ తమకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ ఆయనను ప్రోత్సహించడం సరైందికాదని తాము భావిస్తున్నామని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పొత్తు కుదరకుండా చేసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకత పెంచిందని తెలుస్తోంది.                      


తనకు రాష్ట్రాభివృద్ధి తప్ప మరేమీ ముఖ్యం కాదని, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానానికి వీలుగా పోలవరం వంటి బృహత్తర ప్రాజెక్టులను పూర్తి చేయడం, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడం తనకు ప్రధానమని చంద్రబాబు బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.  ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా కనీసం మూడు, నాలుగు సార్లు పర్యటించాలనుకున్నారని... ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్దికి అవసరమైన హామీలు ఇస్తారని కూడా బీజేపీ నేతలు  హామీ ఇచ్చారు. .