Hardeep Singh Nijjar Killing Video: 9 నెలల క్రితం కెనడాలో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య సంచలనం సృష్టించింది. అప్పటి నుంచే భారత్‌కి, కెనడాకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ హత్యపై కెనడా భారత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. వాటిని భారత్ గట్టిగానే తిప్పి కొట్టింది. ఈ క్రమంలోనే హర్‌దీప్ సింగ్‌ హత్యకి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. CBS News ఈ వీడియోని టెలికాస్ట్ చేసింది. 2023లో జూన్ 18వ తేదీన బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల దుండగులు హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఇప్పుడిదే వీడియో బయటకు వచ్చింది. 2020లోనే హర్‌దీప్‌ని ఉగ్రవాదిగా ప్రకటించింది భారత్. హర్‌దీప్ సింగ్ కార్‌ పార్కింగ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలోనే పక్క నుంచి దుండుగులు ఓ కార్‌లో వచ్చి నిఘా పెట్టారు. ఎగ్జిట్ గేట్‌ వద్దకు వచ్చే సమయానికి కార్‌ని ట్రక్‌కి అడ్డంగా ఆపారు. వెంటనే ఇద్దరు వ్యక్తులు కార్ దిగి ట్రక్‌ వైపు దూసుకొచ్చారు. నిజ్జర్‌కి గురి పెట్టి కాల్చి చంపారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. పక్కనే ఉన్న ఫీల్డ్‌లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఈ హత్యను ప్రత్యక్షంగా చూశారు. కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే అక్కడికి పరుగులు పెట్టినట్టు వివరించారు. హర్‌దీప్‌ అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బతికించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ఇప్పటికీ ఆ దుండగులు ఎవరన్నది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు.

  






భారత్, కెనడా మధ్య వివాదం (India Canada Tensions) ఇంకా సద్దుమణగలేదు. నిజ్జర్ హత్యతో మొదలైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా కెనడాకి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలంగా వెంటనే వెళ్లిపోవాలంటూ అప్పట్లో భారత్‌ తేల్చి చెప్పింది. ఈ మేరకు వాళ్లంకా వెనక్కి వెళ్లిపోయారు. ఇండియన్ స్టూడెంట్స్‌కి స్టడీ పర్మిట్‌ (Canada Study Permits) ఇవ్వడంపై కెనడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఈ విషయం వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది స్టడీ పర్మిట్స్ సంఖ్య బాగా తగ్గిపోయిందని, త్వరలోనే ఇది సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అన్నారు. హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనకాల భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవలే మరోసారి భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని మరోసారి కవ్వించారు. అంతే కాదు. చట్టప్రకారం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరిపానని, అటు అమెరికాతోనూ మాట్లాడానని చెప్పారు.