Andhra Pradesh News:  ఏపీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం సీఎంవో కార్యాలయంతోపాటు పార్టీ ఆఫీస్‌ నుంచి అందింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు విజయవాడకు చేరుకున్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై సీఎం జగన్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా, నిర్ధేశం చేసే అవకాశముంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వైసీపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ కూడా వైసీపీతోనే అనుబంధంగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే సమావేశం అవుతున్నారా..? ఇన్‌చార్జ్‌లు కూడా వస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. 


అత్యవసర భేటీ దేనికి సంకేతం..?


సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 జాబితాల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే మరో వందకుపైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో మెజార్టీ స్థానాలు ఉత్తరాంధ్రకు చెందినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు సంబంధించి ఏమైనా చర్చిస్తారా..? లేక ఉత్తరాంధ్రకు సంబంధించిన గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యేలకు వివరించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సీఎం అందించే అవకాశముందని చెబుతున్నారు. 


దిశా, నిర్ధేశం చేసేందుకేనా


రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నికలకు సన్నద్ధం చేసే ఉద్ధేశంతోనే ఈ భేటీ జరుగుతున్నట్టు చెబుతున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కీలకమైన అంశాలపై సీఎం ఎమ్మెల్యేలతో మాట్లాడి దిశా, నిర్ధేశం చేయనున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదన్న విమర్శలు పార్టీ నుంచి బయటకు వెళుతున్న వారి నుంచి వస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఉన్న ఇబ్బందులను సీఎం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా వారికి ఉన్న ఇబ్బందులు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను జగన్‌ తెలుసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ భేటీ ఉండే అవకాశముంది.


Also Read: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?


Also Read:  పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ కోరుతోందా ? పొత్తల చర్చల్లో ఏం జరుగుతోంది ?