Mahabubabad: పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో వలసలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే  నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ  రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను తమ పార్టీలో బీజేపీ చేర్చుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బలపడేందుకు బీఆర్ఎస్‌లోని మరికొంతమంది కీలక నేతలను పార్టీలోకి బీజేపీ ఆహ్వానిస్తోంది. బీఆర్ఎస్‌ను వీక్ చేయడం ద్వారా ఆ పార్టీ ఓట్లు తమవైపు మళ్లుతాయని కమలదళం ఆశిస్తోంది. బీఆర్ఎస్‌ బలహీనపడేలా చేసేందుకు ఆ పార్టీని నేతలను చేర్చుకుంటోంది. అందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీని చేర్చుకునేందుకు  చర్చలు జరుపుతోంది.


మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు ఆహ్వానం


గురువారం మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హనుమకొండలోని సీతారాం నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి.. ఆయనతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామంటూ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటానంటూ కిషన్ రెడ్డికి సీతారాం నాయక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరిన క్రమంలో.. సీతారాం నాయక్‌ను స్వయంగా కిషన్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీతారాం నాయక్ పార్టీ మారే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.  ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పెద్దల సభకు వెళ్లాలని సీతారాం నాయక్ భావించారు. కానీ మళ్లీ వద్దిరాజు రవిచంద్రకే కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్.. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. దీంతో వేరే పార్టీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో కిషన్ రెడ్డితో భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది.


ఒకసారి మహబూబాబాద్ ఎంపీగా..


సీతారాం నాయక్ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై 34, 992 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో సీతారాం నాయక్‌కు 3.20,569 ఓట్లు రాగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్‌కు 2,85,577 ఓట్లు పోలయ్యారు. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన బానోతు మోహన్‌లాల్‌కు 2,15,904 ఓట్లు వచ్చాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు బీఆర్ఎస్ సీటు కేటాయించగా.. ఆమె గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై 25,487 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఏదైనా నామినేటెడ్ పదవి కూడా సీతారాం నాయక్‌కు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు కూటా కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.


మహబూబాబాద్‌ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు


మహూబాబాద్ ఎంపీ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. సీతయ్య, హుస్సేన్ నాయక్ పేర్లను పరిశీలిస్తోంది. అయినా మరింత బలమైన నేత కోసం బీజేపీ వెతుకులాట మొదలుపెడుతుంది. అందులో భాగంగా సీతారాం నాయక్‌ను బీజేపీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరితే టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరి ఆయన చేరుతారా? లేదా? అనేది చూడాలి.