Janasena News: తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి సీట్ల పంపకాలు ఇరు పార్టీల్లో అగ్గి రాజేసింది. ఇప్పటికే అనేక చోట్ల ఇరు పార్టీల నేతల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు. వీటిలో ఐదు సీట్లను జనసేన ప్రకటించింది. మిగిలిన 19 సీట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన ఐదు సీట్లలోనూ ఇరు పార్టీల నేతల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెనాలి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించింది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన ఆలపాటి రాజా టికెట్‌ ఆశించారు.


కానీ, అనూహ్యంగా ఈ స్థానాన్ని జనసేనకు పొత్తులో కేటాయించారు. అప్పటి నుంచి ఇక్కడ ఇరు పార్టీల మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఒకానొక దశలో పార్టీకి రాజీనామా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. కానీ, అధినేత చంద్రబాబు రాజాతో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. కేడర్‌ రాజీనామాలపై వెనక్కి తగ్గారు కానీ.. నాదెండ్ల మనోహర్‌కు ఎంత వరకు సహకారాన్ని అందిస్తారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నాదెండ్ల మనోహర్‌పై శుక్రవారం సాయంత్రం దాడి జరడంతో.. ఇక్కడ ఇరు పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా విబేధాలు ఉన్నాయన్న విషయం అర్థమైంది. 


ప్రచారానికి వెళ్లి మనోహర్‌పై బాటిల్‌ దాడి


జనసేన పార్టీ తెనాలి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా గురువారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారానికి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఆలపాటి రాజేంద్ర హాజరయ్యారు. వీరంతా కలిసి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా నాదెండ్ల మనోహర్‌పైకి ఓ బాటిల్‌ వచ్చి పడింది. ఎవరో ఒక వ్యక్తి ముందు నుంచి నాదెండ్ల మనోహర్‌పైకి బాటిల్‌ విసిరి కొట్టారు. ఈ బాటిల్‌ మనోహర్‌ తలపై తగలడంతో అక్కడున్న వారంతా అప్రమత్తమయ్యారు. ఎవరంటూ కేకలు వేశారు. బాటిల్‌ విసిరిన వ్యక్తిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ అలజడి రేగినట్టు అయింది. బయటకు ఇరు పార్టీల నేతలు కలిసి తిరుగుతున్నారు. కానీ, కేడర్‌ మాత్రం కలిసే పరిస్థితిలో లేదని ఈ ఘటనతో తేలినట్టైంది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆలపాటి రాజా వర్గీయులా..? లేక వైసీపీకి చెందిన మనుషులా..? అన్నది తెలియాల్సి ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ తరహా ఘటనలతో జనసేన, టీడీపీ కూటమిని ఎవరూ ఇబ్బందులకు గురి చేయలేరని ఇరు పార్టీలు నేతలు చెబుతున్నారు. ఈ ఘటన తరువాత కూడా ఈ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఏది ఏమైనా జనసేన, టీడీపీలో సీట్ల పంపకాలు.. అనేక చోట్ల రగడకు కారణమవుతుండగా, ఈ తరహా ఇబ్బందులను పార్టీలకు కలిగిస్తున్నాయి. 


ఒకానొక దశలో తోపులాట


తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌ జనచైనత్య పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్‌ టాకీస్‌ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేందప్రసాద్‌ను మనోహర్‌ కలిశారు. ఇక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు రాజాకు మద్ధతుగా నినాదాలు చేశారు. మనోహర్‌తో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా మనోహర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలోనే ఎవరో పై నుంచి నీళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ తలకు తగిలింది. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.