Sajjala Ramakrishna Reddy : ముందస్తు ఎన్నికలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని స్పష్టత ఇచ్చారు. అలాగే చంద్రబాబు, పవన్ భేటీపై సజ్జల విమర్శలు చేశారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి... ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఐదేళ్లకు తీర్పు ఇచ్చారని జగన్ పూర్తి కాలం పాలిస్తారని ముందస్తు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ముందస్తు ఎన్నికల ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ భేటీపై స్పందిస్తూ... ప్రతిపక్ష నేతలు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారని ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు.
ముందస్తుపై స్పష్టత
సీఎం జగన్ ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి అని సజ్జల అన్నారు. రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూసి మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలు పూర్తిచేశామన్నారు. ప్రజలకు ఏం కావాలో అది చేశామన్నారు. అందుకే ధైర్యంగా ఇంటింటికీ ఎమ్మెల్యేలను పంపుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ దేశంలోనే విలక్షణమైన పార్టీ అని సజ్జల అన్నారు. చాలా వరకూ అధికార పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటాయని, కానీ ఏపీలో అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు ముందస్తు కోరుకుంటున్నాయన్నారు. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో 2024లో షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లరని తేల్చిచెప్పారు. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని, కానీ చావుకు కారణమైన వారిని పరామర్శించడం ఏంటి? చంద్రబాబు, పవన్ భేటీపై మండిపడ్డారు.
జగన్ వర్సెస్ ప్రతిపక్షాలు
చంద్రబాబు, పవన్ అక్రమ సంబంధాన్ని పవిత్రం అని చెప్పుకోడానికి పదే పదే కలుస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, జనసేన కలవడం శుభపరిణామని సీపీఐ రామకృష్ణ అంటున్నారని, ఎరుపు కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో? అంటూ సెటైర్లు వేశారు. బలంగా ఉన్న సీఎం జగన్ ఎదుర్కోడానికి ప్రతిపక్షపార్టీలన్నీ ఏకం అవుతున్నాయని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌లు ఎన్ని పగటి కలలు కన్నా జగన్ ను ఏంచేయలేరన్నారు. జగన్ ప్రజల్లో ఉండి, ప్రజలకు ఏం కావాలో చేసే నాయకుడన్నారు. చంద్రబాబు, పవన్ కు ఏ విలువలు, సిద్దాంతాలు ఉన్నాయో ప్రజలకు అర్థం అయిందన్నారు. జగన్ లాంటి బలవంతమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు ఇలాంటి పార్టీలన్నీ ఒకటవుతున్నాయన్నారు. రాష్ట్రంలో దుష్టశక్తులు ఇంకా ఏం చేస్తాయో చూడాలన్నారు. వీళ్లందరికీ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.