వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారిసు’ మూవీని తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 11న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంక్రాంతి రోజున (జనవరి 14న) విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేస్తూ సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కుటుంబంతో కలిసి ఆనందించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఈ సినిమాలో విజయ్‌కు జంటగా రష్మిక మందన నటించింది. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. మొత్తానికి అంతా సర్దుకుని 14న ‘వారసుడు’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో ‘వారసుడు’ వాయిదాపై దిల్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తమిళం, తెలుగులో ‘వారసుడు’ మూవీ తీస్తున్నామని ప్రకటించిన రోజు నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు. దానిపై నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాను. 12న బాలయ్య, 13న చిరంజీవి సినిమాలు ఉన్నాయి. పెద్ద స్టార్స్ కాబట్టి ఆ సినిమాలు ప్రతి థియేటర్లో పడాలి. ఆ తర్వాతే నా సినిమా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ‘వారసుడు’ ఆ సినిమాలకు పోటీ కాదు. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తమిళంలో ముందే రిలీజై.. రివ్యూలు వచ్చేస్తే ఇబ్బంది కదా అని చాలామంది చెప్పారు. కానీ, నాకు ఆ సినిమా మీద నమ్మకం ఉంది. అందుకే జనవరి 14న రిలీజ్ చేస్తున్నా. పాజిటివ్‌గానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ కొందరు నా మీద పడి ఏడుస్తుంటారు. కానీ, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’’ అని అన్నారు.
విజయ్ వస్తారు
అయితే ఈ సినిమాను తెలుగులో విజయ్ ఎందుకు ప్రొమోట్ చేయడంలేదు అన్న విషయంపై కూడా అభిమానుల నుంచి ప్రశ్నలు వెలువడుతున్నాయి. దీనిపై దిల్ రాజు స్పందించారు. ఈ సినిమా 11న విడుదల చేయాలనుకున్నాం.. కాబట్టి విజయ్‌ను హైదరాబాద్‌కు తీసుకురాలేకపోయానని తెలిపారు. ఇప్పుడు 14కు విడుదల చేస్తున్నాం కాబట్టి తప్పకుండా విజయ్‌ను తీసుకొచ్చి ప్రొమోట్ చేయిస్తానని అన్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు బరిలో ఉన్నాయి కాబట్టి.. అందరు నిర్మాతలు బాగుండాలన్న ఉద్దేశంతో తానే ఓ అడుగు వెనక్కివేసి తన సినిమాను 14కి పోస్ట్ పోన్ చేసుకున్నానని తెలిపారు.
‘మహర్షి’తో ‘వారసుడు’కు పోలికే ఉండదు
అయితే ‘వారసుడు’ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాను మహర్షికి రీమేక్‌గానో లేకా కంటిన్యుయేషన్‌గానో తీస్తున్నట్లు అనుకున్నారు. దీంతో ‘మహర్షి’ సినిమాకు ‘వారసుడు’ సినిమాకు అసలు పోలికే ఉండదని దిల్‌రాజు, వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ సినిమాలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విజయ్‌తో ఎలా కుదిరింది అనే విషయాన్ని ఇదివరకు తమిళనాడులో దిల్‌రాజు చెప్పుకొచ్చారు. పాపం వచ్చీ రాని ఇంగ్లీషు, తమిళంలో ఆయన మాట్లాడిన మాటలు విని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అదీదాస్ సర్ అదీదాస్ సర్ అంటూ దిల్ రాజు చెప్పిన డైలాగులపై విపరీతమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా దిల్‌రాజుకు మంచి వసూళ్లు కురిపిస్తోందో లేదో మరో వారం రోజుల్లో తెలిసిపోతుంది.