TDP Bonda Uma : వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో రాష్ట్రంలో అంతులేని అవినీతికి పాల్పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జేగ్యాంగ్ చేస్తున్న అవినీతిని టీడీపీ అనేకసార్లు ఆధారాలతో సహా బయటపెట్టినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రులుగా పనిచేసి, రాజీనామాలు చేసిన 24 మంది అవినీతికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని బొండా ఉమా స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 


పుంగనూర్ వీరప్పన్ 


నిన్నటివరకు కేబినెట్ మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అనకొండగా నిలిచి ప్రజల్ని లూఠీ చేయడంలో అగ్రస్థానంలో నిలిచారని బొండా ఉమా ఆరోపించారు. అంతులేని సంపదను పోగుచేసిన కేబినెట్ మంత్రుల్లో తొలిస్థానం పెద్దిరెడ్డిదే అనే ఆయన ఆరోపించారు. రూ.6,889 కోట్ల వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. పుంగనూర్ వీరప్పన్ గా పేరుపొందిన పెద్దిరెడ్డి అవినీతి వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాలను టీడీపీ సేకరించిందన్నారు. పెద్దిరెడ్డికి శివశక్తి డెయిరీ ఉందని, పాల ఉత్పత్తిదారులుగా ఉన్న సంఘాల వారిని, పాడిపై ఆధారపడి బతికే పేద, మధ్య తరగతి మహిళలను బెదిరించి, వారివద్దనుంచి తక్కువ ధరకు కేవలం లీటర్ పాలను రూ.18కే కొని వారి పొట్టకొట్టి రూ.700 కోట్ల వరకు సంపాదించారని ఆరోపించారు. పేదలు ఎండలో గేదెలు మేపుకొని నానా అవస్థలు పడి పాలు అమ్ముకుంటే ఆ పాలను కూడా కాజేయడానికి సిద్ధమయ్యారని పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో పెద్దిరెడ్డికి ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉందని, దానిలో మామిడి పండ్లతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేస్తుంటారన్నారు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను బెదిరించి వారి వద్ద నుంచి తక్కువ ధరకు మామిడికాయలు కొని తన పల్ప్ ఫ్యాక్టరీకే మామిడి ఎగుమతి చేయాలని వారిని భయపెట్టి రూ.190 కోట్ల వరకు రైతుల జేబులు కొట్టి కాజేశారని ఆరోపించారు.  


అవినీతి అనకొండ 


"భూమాఫియాలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోనే కింగ్ గా నిలిచారు. తిరుపతి, మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి ప్రాంతాల్లో యథేచ్ఛగా తనను అడిగేవాడు ఆపేవాడే లేడన్నట్లుగా 800 ఎకరాలకు పైగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెద్దిరెడ్డి ఆక్రమించిన 800 ఎకరాల భూమి విలువ రూ.810 కోట్ల వరకు ఉంది. అలానే తిరుపతి హథీరాంజీ మఠానికి చెందిన రూ.60 కోట్ల విలువైన 3 ఎకరాలను కూడా దిగమింగారు. ఆఖరికి డీకేటీ పట్టాభూముల్ని కూడా పెద్దిరెడ్డి వదల్లేదు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని కల్లూరులో ఉన్న రూ.870 కోట్ల విలువ చేసే 88 ఎకరాల డీకేటీ భూమిని స్వాహాచేశారు.  తన బినామీలతో తంబళ్లపల్లిలోనే రూ.420 కోట్ల విలువచేసే 300 ఎకరాలను మూడోకంటికి తెలియకుండా మింగేశారు. పెద్దిరెడ్డి లాంటి అవినీతి అనకొండ ఆఖరికి పేదలకు ఇచ్చే సెంటు పట్టా భూముల్ని కూడా వదల్లేదు. పేదలకు ఇచ్చిన సెంటు పట్టా భూముల కొనుగోలు, చదును పేరుతో రూ.85 కోట్ల వరకు హాంఫట్ చేశారు. ఇసుక మాఫియా లోనూ పెద్దిరెడ్డి తన చక్రం తిప్పారు. తంబళ్లపల్లి కేంద్రంగా పెద్దిరెడ్డి  రూ.130 కోట్ల వరకు ఇసుక అమ్మకాలతో కాజేశారు. అలానే చిత్తూరు కేంద్రంగా రూ.70 కోట్లు, పీలేరు కేంద్రంగా రూ.62 కోట్లను ఇసుక కుంభకోణంలో కొల్లగొట్టారు." అని బొండా ఆరోపించారు. 
 
ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆయనే కింగ్ 


"టీడీపీ హాయాంలో ఎర్రచందనం దుంగపట్టుకోవాలంటేనే వణికిపోయారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో శేషాచలం అడవే మాయమైంది.  రూ.1800 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పెద్దిరెడ్డి విదేశాలకు తరలించి, ఏకంగా అడవుల్నే భోంచేశారు. పెద్దిరెడ్డి అధికారం దెబ్బకు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా నారాయణస్వామి డమ్మీ అయిపోయారు.  తాను మంత్రిగా, తన కొడుకు, ఇతర కుటుంబ సభ్యులకు వివిధ పదవులిచ్చి ప్రజల సొమ్మును దారుణంగా దిగమింగారు. జగన్ కు తెలియకుండానే పెద్దిరెడ్డి ఆయన పేరు చెప్పి తన మంత్రి పదవితో ఇన్ని వేల కోట్లు పోగేశారా? పెద్దిరెడ్డి అవినీతి, దోపిడీపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే. టీడీపీ పెద్దిరెడ్డి అవినీతికి సంబంధించి విడుదల చేసిన సమాచారంపై ముఖ్యమంత్రి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి. రాజీనామాలు సమర్పించిన మంత్రులందరి అవినీతి, దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం." అని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.