Supreme Court Amaravati Case: ఏపీ రాజధాని అమరావతి కేసు ఈ రోజు సుప్రీంలో  ఏప్రిల్‌కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినపిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. గత ఏడాది జూలైలో డిసెంబర్‌కు వాయిదా వేసింది. అయితే డిసెంబర్ లో విచారణకు రాలేదు. జనవరిలో విచారణకు వచ్చింది కానీ ఏప్రిల్ కు వాయిదా పడటంతో అప్పటికి ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోతుంది. రాజధాని అంశానికి ఓ ముగింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. 


అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు


అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.  అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు.  అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే  జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 


హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం


రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పు స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వటం సహేతుకం కాదని పేర్కొంది. దీని పైన కొంత కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఇక, ఈ రోజు విచారణ తరువాత సుప్రీంకోర్టు ప్రతివాదులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. 


మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు వేయలేకపోయిన ప్రభుత్వం  


2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఏడాది డిసెంబర్ లో మూడు రాజధాను ప్రతిపాదన చేసారు. ఈ దిశగా చట్ట సభల్లో బిల్లులు తీసుకొచ్చారు. హైకోర్టులో విచారణ వేళ ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. తరువాత తీర్పు ఇచ్చిన హై కోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ...కాల పరిమితిని నిర్దేశిస్తూ స్పష్టత ఇచ్చింది.ఈ తీర్పు పైన సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని పేర్కొంది.   రాష్ట్ర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని రాజధానిని కేవలం అమరావతికే పరిమితం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని నివేదికలు సూచించిన అంశాన్ని సుప్రీంకు వివరించింది. 2014-19 కాలంలో అమరావతి ప్రాంతంలో 10 శాత మౌలిక వసతలు పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ కోసం ఏప్రిల్ కు వాయిదా వేసింది.