Srikakulam Kaval Villages : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని ఉద్దాన ప్రాంతంలో.. ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తంగా నూట ఇరవైకి పైగా పచ్చని పల్లెటూర్లు ఒకే పోలికతో ఉంటాయి. అందుకే వీటిని కవల గ్రామాలు అని పిలుస్తారు. ఈ కవల గ్రామాలు ఇక్కడివారి మధ్య ఆప్యాయతను పంచుతూ ఉండగా..బయట ప్రాంతాల వారు ఇక్కడి వస్తే మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.


రెండో కోనసీమ ఉద్దానం


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. ఈ కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో నూట ఒక్క పంచాయితీలు ఉన్నాయి.. ఈ పంచాయితీల పరిధిలో ఇంకా వందలాది గ్రామాలు ఉన్నాయి.. ఉద్దాన ప్రాంతంలో భాగమైన ఈ నాలుగు మండలాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. రెండవ కోనసీమగా పిలిచే ఈ ఉద్దాన ప్రాంతంలో ఆప్యాయతలు, ఆత్మీయతలు కుడా అధికంగానే ఉంటాయి.. వ్యయసాయం ప్రధాన వృత్తిగా  జీవించే ఇక్కడి వారు.. తరతమ భేదాలు మరిచి.. అందరితో కలివిడిగా ఉంటారు.. ఏ గ్రామంలో చిన్న శుభకార్యం జరిగినా.. కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం అక్కడ కొలువుదీరుతారు.. ఆనందంగా గడుపుతారు.. సమస్యలు వస్తే సమిష్టిగా పనిచేసి సరిచేస్తారు.. అందుకే వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఉద్దానంలో కలహాలు, కొట్లాటలు అన్న పదమే అరుదుగా వినిపిస్తూ ఉంటుంది.


అనేక గ్రామాలకు పుట్టుగ పేరు 


ఇక ఈ ఉద్దాన ప్రాంతంలో ఇక్కడివారి ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఇక్కడి గ్రామాల పేర్లు.. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని నూట ఒక్క పంచాయితీలలో సుమారు మూడు వందల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు వందల పై చిలుకు గ్రామాలలో సగానికి పైగా గ్రామాలు ఒకే పోలికతో ఉంటాయి. ఏ ఊరిలో ఎక్కువ మంది ఒకే ఇంటి పేరుతో ఉంటారో.. అదే పేరుతో ఆ గ్రామం పేరు ముడిపడి ఉంటుంది. ఇంటి పేరు తరువాత పుట్టుగ అని చేర్చి అప్పట్లో ఈ గ్రామాలకు నామకరణం చెయ్యడం ప్రారంభించారు.. అదే సాంప్రదాయాన్ని స్థానికులు కొనసాగించడంతో ఇప్పుడు నూట ఎభైకి పైగా పుట్టుగలు ఉద్దాన ప్రాంతంలో వెలశాయి.. ఒక ఊరిలో గొండ్యాల ఇంటిపేరు తో ఎక్కువ మంది ఉంటె ఆ గ్రామం పేరు గొండ్యాల పుట్టుగ అని, బార్ల వారు ఎక్కువగా ఉంటె బార్ల పుట్టుగ, బొర్ర వారు ఎక్కువ ఉంటె బొర్ర పుట్టుగ అని.. గ్రామాల పేర్లు  ఉద్దాన ప్రాంతంలో దర్శనం ఇస్తాయి.. అయితే అన్ని గ్రామాలు యూనిఫాం గా ఉండాలన్న ఆలోచనతో అప్పట్లో  ఇంటిపేరుతో సంబంధం లేకుండా ఉండే గ్రామాలకు కూడా చివరన పుట్టుగ అని చేర్చి మొత్తంగా ఉద్దానంలో ఎక్కడ చూసినా పుట్టుగ అని కనిపించేలా వినూత్న ఆలోచనకు వందల ఏళ్ళ క్రితమే ఆలోచన చేస్తారు ఉద్దాన ప్రాంత పూర్వీకులు.. ఇప్పటికీ కొత్తగా ఏర్పడే కాలనీలకు ఇదేతరహా నామకరణాలు చెయ్యడం స్థానికులు అలవాటు చేసుకోవడంతో.. ప్రస్తుతానికి నూట ఎభైకి పైగా పుట్టుగలు ఈ ఉద్దాన ప్రాంతంలో పుట్టినట్లు తెలుస్తోంది.అయితే మొత్తంగా ఎన్ని పుట్టుగలు ఉంటాయి అన్నదానిపై ఇప్పటికీ స్పష్టమైన వివరాలు లేవు.. పంచాయితీల పరంగా ఒక అంచనా ఉన్నప్పటికీ.. పంచాయితీల పరిధిలో ఉండే చిన్న చిన్న గ్రామాల లెక్క అనేదానిపై స్పష్టత కొరవడింది. కొంతమంది పూర్వీకులు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో మొత్తంగా అరవై నాలుగు పుట్టుగలు ఉండేవని.. అయితే.. కాలానుగుణంగా.. అనేక కొత్త గ్రామాలు, కాలనీలు ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన గ్రామాలకు సైతం ఇదే పుట్టుగ పేర్లు ఉండటం తో.. నూట ఎభైకి పైగానే ఉద్దాన ప్రాంతంలో కవల గ్రామాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.


కొత్త వారికి అయోమయం కల్పిస్తున్న గ్రామాలు


బెజ్జిపుట్టుగ, గొండ్యాల పుట్టుగ, ప్రగడ పుట్టుగ, రామయ్యపుట్టుగ, చండి పుట్టుగ, లండ పుట్టుగ, బొర్ర పుట్టుగ, జల్లు పుట్టుగ.. ఇలా ఉద్దాన ప్రాంతంలో ఉండే వందలాది పుట్టుగలు స్థానికుల మధ్య ఆప్యాయతలు పంచుతూ ఉండగా.. బయట ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారికి మాత్రం కావలసినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.. బయట ప్రాంతాల నుండి ఉద్దాన ప్రాంతానికి ఉద్యోగ రీత్యా, శుభకార్యాల కోసం వచ్చే వారు.. ఒక గ్రామం అడ్రస్ కు బదులు.. వేరే గ్రామానికి చేరుకోవడం.. అక్కడికి వెళ్ళిన తరువాత.. ఈ పుట్టుగల కన్ఫ్యూజన్ నడుమ.. అసలు గ్రామానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు.. బయట ప్రాంతాల వారికి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ కవల గ్రామాలు అప్పుడప్పుడు స్థానికులకు సైతం జలక్ లు ఇస్తూనే ఉంటాయి.. ఏమరపాటుగా అడ్రస్ నోట్ చేసుకుంటే.. ఇక్కడివారు సైతం అనేక సందర్భాల్లో ఈ కవల గ్రామాలతో ప్రయాస పడుతూనే ఉంటారు.