Chilamathur SI Viral Video : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ వీరంగం సృష్టించారు.  ఓ పార్టీకి చెందిన నేతల తనపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు.  ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిని ఎస్ఐ రంగడు చికబాదారు. బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనను పక్కనున్న వ్యక్తి వీడియో తీశారు. సంజీవరాయనపల్లి గ్రామంలో పద్మావతి అనే  దివ్యాంగురాలికి పింఛన్ ఇవ్వకుండా అధికార పార్టీ నేత ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు.  పింఛన్ ఎందుకు ఇవ్వడంలేదని అడిగిన పద్మావతి కుమారుడు వేణుపై స్థానిక నేత దామోదర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 


వీడియో వైరల్ 


ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు వేణు.  అయితే ఎస్ఐ వేణుపై అసభ్యపదజాలంతో దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఎస్ఐ 'ఎవరికి డబ్బులు ఇచ్చావ్, ఐదు వేలు చెప్పు. ఇంకొసారి వచ్చావంటే అంతే' అని తీవ్ర ఆగ్రహంతో దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాధ్యత గల పోలీస్ అధికారి ఇలా బూతులు తిడుతూ దాడికి పాల్పడడం సరికాదని స్థానికులు అంటున్నారు. నిజానిజాలు పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సిన పదవిలో ఉండి దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


విచారణకు ఆదేశించిన ఎస్పీ 


శ్రీ సత్యసాయి జిల్లాలో వేణు అనే వ్యక్తిపై చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ స్పందించారు. దాడిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్యను విచారణాధికారిగా నియమించారు ఎస్పీ.  విచారణ ఆధారంగా చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు. 






Also Read : Alair Police Station : దేశంలోని టాప్ 5 పోలీస్ స్టేషన్లలో ఒకటి ఆలేరు - ఆ పీఎస్ ప్రత్యేకతలేమిటో తెలుసా ?