Nizamabad Fire Accident: నిజామాబాద్ జిల్లాలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. రవాణా చేస్తున్న గోవులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి శివారులో ఈ ఘటన జరిగింది. ఓ అంబులెన్స్‌లో సుమారు 10 వరకూ ఆవులను తరలిస్తుండగా, ఆ వాహనం మొత్తం తగలబడిపోయింది. AP25 W 0212 నంబరు గల ఆ అంబులెన్స్‌లో సుమారు 10 వరకూ ఆవులను తరలిస్తున్నారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా ఇందల్వాయి వద్ద ఈ ఘటన జరిగింది.


ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధం అయింది. దీంతో అందులోని ఆవులన్నీ పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. మంటలను చూసిన భయంలో అంబులెన్స్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


13 ఆవులను ఒకే అంబులెన్స్‌లో ఉంచి తరలిస్తుండడంతో ఆ కుదుపులకు ఆవులు పక్కనే ఉన్న సిలిండర్లు లీకైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణం వల్లనే మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్ని కీలలను చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్ తలుపులను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు. దాంతో లోపలి ఆవులు సజీవ దహనం అయ్యాయి.