Sharmila On Jagan : వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి బద్ద వ్యతిరేకి అని.. అలాంటి పార్టీతో తెర వెనుక పొత్తులు పెట్టుకున్న వారు రాజకీయ వారసులు ఎలా అవుతారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మంగళగిరిలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
బీజేపీతో తెర వెనుక పొత్తులు పెట్టుకునేవారు రాజకీయ వారసులెలా అవుతారు ?
వైఎస్ జీవితాంతం వ్యతిరేకించిన పార్టీతో ఇవాళ ఆయన రాజకీయ వారసులుగా చెప్పుకుంటున్న వారు తెర వెనుక పొత్తులు పెట్టుకున్నారని .. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. వారంతా వైఎస్ రాజకీయ ఆశయాలను నిలబెట్టిన వారు ఎలా అవుతారో ఓ సారి ఆలోచన చేసుకోవాలని సలహా ఇచ్చారు.
రాహుల్ ను ప్రధానిని చేయడమే వైఎస్ ఆఖరి కోరిక
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమని షర్మిల స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ప్రధాని కావాలని మొదట చెప్పిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ లాగా మంచి వ్యక్తిత్వం ఉన్న నేత అన్నారు. దేశం సమైక్యత కోసం పాదయాత్ర చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. తన పాదయాత్రకు స్ఫూర్తి అని చెప్పారన్నారు. ఇవాళ పాదయాత్రలు చేసిన అధికారం చేపట్టిన వారు తర్వాత మర్చిపోతున్నారని అధికారం అనుభవించడానికే ప్రాధాన్యం ఇస్తారని.. అా చేసి ప్రజలకు దూరమవుతారన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఎన్నో మంచి పథకాలు తీసుకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన చేశారని గుర్తు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా గెలిచిన తర్వాత అంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాలని అనుకోరన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం ప్రతి పథకం ప్రజలకు అందాలన్న లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన చేశారన్నారు.
వ్యూహాత్మకంగా వైెఎస్ రాజకీయ విధానంపై షర్మిల ప్రసంగం
షర్మిల ప్రసంగం వ్యూహాత్మకంగా సాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తానే అసలైన రాజకీయ వారసురాలినని .. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ నేత మాత్రమేనని గుర్తు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో జగన్ బీజేపీతో అంట కాగుతున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్ పేరు పెట్ట చెప్పకపోయినా వైఎస్ రాజకీయ వారసుడిగా ఆయనే ఉన్నారు. షర్మిల ప్లాన్ ప్రకారం వైఎస్ అభిమాన ఓటు బ్యాంక్ ను జగన్ కు దూరం చేసేలా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారని అనుకోవచ్చు.