AP News: ఏపీలో సంచలనంగా మారిన బాలిక హత్య కేసులో నిందితుడి కోసం అనకాపల్లి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి వేర్వేరు మార్గాల ద్వారా నిందితుడు ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఫొటోలను కూడా పోలీసులు మీడియాకు విడుదల చేశారు. తాజాగా పోలీసులు ఓ ప్రకటన కూడా వెలువరించారు. సురేశ్ అనే నిందితుడు నేరం చేసి పారిపోయిన సమయంలో నలుపు రంగు చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడని.. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని జిల్లా పోలీసులు ప్రకటించారు.
ఫోన్ నెంబర్లు ఇవే
బాలిక హత్య కేసు నిందితుడి వివరాలు కనుక తెలిస్తే 9440796084, 9440796108, 9440904229, 7382625531 లేదా డయల్ 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలని అనకాపల్లి పోలీసులు సూచించారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.. వారికి బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో ఓ బాలికను నిందితుడు జులై 6న హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించిన అతను ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నప్పటికీ అతని ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు, బాలిక మృతిపై ఏపీ ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది.
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. తాము 20కి పైగా ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితుడి కోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు సహా రద్దీగా ఉండే ప్రాంతాలన్నిటిలో వెతుకుతున్నామని చెప్పారు.
నిందితుడు సురేశ్ తెలివిగా ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. సురేశ్ పబ్లిక్ టెలిఫోన్ నుంచి అతని కుటుంబ సభ్యులకు కానీ లేదా స్నేహితులతో కానీ, టచ్ లో ఉండే అవకాశం ఉన్నందున వారి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, విశాఖపట్నం జైలులో గతంలో అతను ఉన్నప్పుడు చేసుకున్న పరిచయాలపైనా విచారణ చేస్తున్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుని తీరతామని పోలీసులు గట్టిగా చెబుతున్నారు.