Sajjala On YSRCP Loss :   అసాధ్యమైన హామీలను ప్రజలకు ఇచ్చి టీడీపీ గెలిచిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో నిర్వహించిన వైఎస్  జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఓట‌మిపై అనుమానాల సంగ‌తి ఎలా ఉన్నా, ప్ర‌జ‌ల తీర్పుగానే భావిస్తున్నామ‌ని ఓట‌మిని ఒప్పుకున్నారు. అంతేకాదు మీ ఇంట్లో మంచి జ‌రిగితేనే ఓటేయండి అని ఎన్నిక‌ల‌కు వెళ్లాం. కానీ ఫలితాలు వేరుగా వ‌చ్చాయ‌న్నారు.    అధికారంలోకి వచ్చిన వారు హామీలను అమలు చేయలేమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని  సజ్జల మండిపడ్డారు. ఇప్పటికప్పుడు హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శఇంచారు.             


చంద్రబాబు హామీలు ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నారు !                                        


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చంద్రబాబు అంటున్నారని.. ఆర్నెల్ల క్రితం హామీలిచ్చేప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అంచనా లేదా అని  సజ్జల ప్రశ్నించారు.  అలవికాని హామీలివ్వడం ఎందుకు ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.  చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం హామీలు ఇచ్చినా కూడా వైసీపీ గెలిచి ఉండేదన్నారు.  కానీ అది జగన్‌ పద్ధతి కాదని చేయగలిగే హామీలే జగన్ ఇస్తారన్నారు. చంద్రబాబు పదే పదే మోసం చేస్తున్నారని..  అలా మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారని  విమర్శించారు.                                 


హామీలు అమలు చేయకపోతే అందరం కలసి నిలదీద్దాం !        


ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును అందరూ కలిసి నిలదీద్దామని ప్రజలకు  సజ్జల పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏ ఇబ్బంది కలిగినా వైసీపీ చూస్తూ ఊరుకోబోదని  రోడ్డెక్కుతామని హెచ్చరించారు.   ప్రజల పక్షాన పోరాటానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని... వైఎస్‌ ఆశయ సాధన కోసం జగన్‌ ఎంతో కృషి చేశారని సజ్జల  ప్రశంసించారు.  విద్య, వైద్య రంగాల్లో జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 


నిరాశ వద్దని పార్టీ శ్రేణులకు అంబటి రాంబాబు  పిలుపు           


ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్టంలో సీఎంగా పని చేసి రాష్ట్ర అభివృద్ధికోసం పాటుప‌డిన‌ నాయకుడు రాజశేఖర్ రెడ్డి... గుర్తుండి పోయే పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచి పోయారని  భావోద్వేగానికి గురయ్యారు.   ఆయన చనిపోకుండా ఉంటే రాష్టం పరిస్థితి వేరులా ఉండేదని జోస్యం చెప్పారు.  రాజశేఖర్ రెడ్డికి కూడా ఒడి దుడుకులు వచ్చాయన్నారు.   ఆయనే మనకు స్ఫూర్తి. కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడకుండా ఉండాని కార్యకర్తలకు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.