Tollywood Latest News: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును నటి హేమ కలిశారు. తనను మా సభ్యత్వం నుంచి తొలగించడంపై ప్రశ్నించారు. ఎలాంటి షోకాస్ నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంపై లెటర్ రాశారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని రిక్వస్ట్ చేశారు. 


ఇది "మా"కు తగదు: హేమ


"మీడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో నేను- దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక ల్యాబ్లో రక్తపరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నేను ఎటువంటి మాదక ద్రవ్యాలు సేవించలేదనే విషయం స్పష్టంగా రుజువైంది. అతి త్వరలోనే పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల వివరాలు కూడా బయటకు వస్తాయి. వాటిలో కూడా నేను నిర్దోషినని తేలుతుందనే నమ్మకం ఉంది. ఈ లోపులోనే నన్ను దోషిగా చిత్రీకరించటం. ప్రాథమిక సభ్యత్వం తొలగించటం, పరిణితి కలిగిన "మా" సంస్థకు తగదని నేను భావిస్తున్నాను.


Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?



రక్షించాల్సిన బాధ్యత "మా"దే: హేమ


గత కొన్ని రోజులగా నాపై జరుగుతున్న ప్రచారం వల్ల నేను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నాను. ఈ పరిస్థితులలో నాకు 'మా' అండగా ఉండాలని కోరుకుంటున్నాను. సుమారు మూడు దశాబ్దాలుగా నేను ఒక నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ప్రజల అభిమానాన్ని పొందుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు కావాలని చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత "మా"పై ఉంది. మీరు ఈ విషయాన్ని గుర్తించి నాపై విధించిన సస్పెషన్‌ను వెంటనే ఎత్తివేస్తారని ఆశిస్తున్నాను." అని హేమ రాసిన లెటర్‌లో ఉంది. 


Also Read: మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి - 'గేమ్ ఛేంజర్' అప్‌డేట్‌తో వచ్చిన రామ్ చరణ్, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్


ఈ లెటర్‌తో ఆమె తన మెడికల్ సర్టిఫికేట్లను కూడా జత చేసి మంచు విష్ణును కలిసి అందజేశారు. మా అధ్యక్షుడికి ఈ లెటర్ ఇవ్వడంతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కాపీని పంపించారు. బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న హేమను పోలీసులు అరెస్టు చేశారు. హేమ పేరుతో కాకుండా వేరే పేరుతో పార్టీకి వెళ్లారు. అక్కడ డ్రగ్స్‌ కూడా వాడినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. ఆమెను విచారించిన పోలీసులు ఈ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై హేమ విడుదలయ్యారు. ఈ కేసు నడుస్తున్న టైంలోనే "మా" సభ్యత్వం నుంచి హేమను తొలగిస్తున్నట్టు అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. దీంతో తన సభ్యత్వంపై పోరాటం చేస్తున్నారు హేమ. ఇందులో భాగంగానే మంచు విష్ణు, చిరంజీవికి లెటర్ రాశారు.