Minister Nimmala Ramanaidu Doing Works In Palakollu: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఒక్క ఫోన్ కాల్‌కు స్పందించారు. ఓ సంకల్పంతో కొడవలి చేతబట్టి బయలుదేరగా బయలుదేరగా ఆయన వెంట అనుచరులు సైతం దండులా కదిలారు. తాము సైతం అంటూ ఆయనతో పాటు శ్రమదానంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని (Palakollu) టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం మంత్రి శ్రమదానం చేశారు. స్వయంగా పార, పలుగు పట్టి అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను సైతం తొలగించారు. కాలనీలో జన సంచారానికి అవరోధంగా ఉన్న చిన్న చిన్న చెట్లు,పెరిగిన పిచ్చి మొక్కలను తీసేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం గృహాలను పూర్తి చేస్తే.. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం పని చేయలేదని మండిపడ్డారు.






టిడ్కో ఇళ్లకు తొలగిన అడ్డంకులు


ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. అప్పట్లో రుణానికి గ్యారంటీ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పినా.. హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు అధికారం మారడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. దాదాపు రూ.2 వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల గృహాలు నిర్మించాల్సి ఉందని అధికారులు లెక్కతేల్చారు. ఇందుకు దాదాపు రూ.5 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.1,300 కోట్ల నిధులున్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించగా.. అక్కడి నుంచి అనుమతి రాగానే.. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కానున్నాయి. కాగా, 2014 - 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టిన వారికి ఇప్పటివరకూ బిల్లులివ్వలేదు. ఇవి దాదాపు రూ.473 కోట్ల వరకూ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.


Also Read: Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు