Kidney Rocket Scam In Vijayawada: ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు డబ్బు ఆశ చూపి అతని నుంచి కిడ్నీ కొట్టేశారు. అనంతరం డబ్బులివ్వకుండా మోసం చేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు (Guntur) చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా.. అప్పుల్లో కూరుకుపోయాడు. చివరకు లోన్ యాప్స్ నుంచి సైతం అప్పులు తీసుకున్నాడు. ఏదో విధంగా అప్పులు తీర్చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఒకసారి ఫేస్ బుక్‌లో కిడ్నీ దానం చేస్తే డబ్బులు ఇస్తామన్న పోస్ట్ చూశాడు. తనకు డబ్బులు అవసరమని కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని వారిని సంప్రదించాడు.


వెంటనే బాషా అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు... తాను కూడా డబ్బులు అవసరమై కిడ్నీ ఇచ్చానని ... అందుకు బదులుగా రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పాడు. దీంతో ఆశపడిన మధుబాబు విజయవాడ వెళ్లి భాషాను కలిశాడు. అతను వెంకట్‌ను పరిచయం‌ చేశాడు... తన బావ కిడ్నీ వ్యాదితో బాధ పడుతున్నాడని చెప్పిన వెంకట్..  కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీతీసుకున్నారు.


రికార్డులు మార్చి..


కిడ్నీని రక్త సంబంధీకులు లేదా బందువులు మాత్రమే ఇవ్వాలని రూల్స్‌ ఉండడంతో రికార్డులు మార్చి మధుబాబును బంధువుగా చూపారు. ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటానని చెప్పి రైట్ కిడ్నీ తీసుకున్నారని బాధితుడు తెలిపారు. ఆపరేషన్ జరిగి ఇంతకాలం అయినా డబ్బు ఇవ్వకపోవడంతో మధుబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులు అడుగుతుంటే తనను బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'మిగిలిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. స్నేహితుడిలా కిడ్నీ దానం చేశావ్' అంటూ సదరు ముఠా సభ్యులు బెదిరిస్తున్నారని వాపోయాడు. 


ఎస్పీకి ఫిర్యాదు


తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మధుబాబు గుంటూరు ఎస్పీని అశ్రయించారు. తన ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని తన కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. కిడ్నీ కోల్పోయిన తర్వాత తన జీవితం మరింత దుర్భరంగా మారిందని.. శక్తి లేకుండా పోయిందని... ఏ పనీ చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Also Read: Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం