Jagan fans met funny reply From Raghurama  :  రాజకీయ పంచ్‌లలో రఘురామ కృష్ణరాజు తనదైన మార్క్ చూపిస్తారు. ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అవుతారు. తాజాగా అలాంటి  ఘటననే విజయవాడ ఎయిర్ పోర్టులో జరిగింది. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రఘురామ వచ్చారు. ఆ సమయంలో బయట కొంత మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. వారంతా రఘురామను చూసి.. జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాస్త ఆశ్చర్యపోయిన రఘురామ వెనుక వస్తున్నారని గుర్తు పట్టకపోతే ఎలా అని వారిని ప్రశ్నించారు. తాను చాలా పొడుగున్నానని సెటైర్లు వేస్తూ కారు వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారితో మాట్లాడి కారు ఎక్కి వెళ్లిపోయారు. 


ఎయిర్ పోర్టులో   టీజ్ చేసిన జగన్ ఫ్యాన్స్‌కు రఘురామ కౌంటర్                               


వైఎస్ఆర్ జయంతి కావడంతో జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలో  వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించి... కడప నుంచి తిరిగి రావాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెప్పేందుకు విజయవాడ నుంచి కొంత మంది కార్యకర్తలు గన్నవరం వచ్చారు. అయితే జగన్ రావడానికంటే ముందే రఘురామ రావడంతో ఆయనను టీజ్ చేసే ప్రయత్నం చేయడంతో ఆయన రివర్స్ లో పంచ్ వేశారు. 


రచ్చబండ పేరుతో రఘురామ ప్రతీ రోజూ విమర్శలు                            


జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో రఘురామకృష్ణరాజు ఆయనపై రోజూ రచ్చబండ  పేరుతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించేవారు. నిజానికి రఘురామ వైసీపీ తరపున గెలిచారు. కానీ సరైన గౌరవం ఇవ్వడం లేదన్న కారణతో ఆరు నెలలకే పార్టీతో విబేధించి రెబల్ అయ్యారు. ఆయనపై అనర్హతా వేటు వేయించేందుకు చాలా ప్రయత్నం చేశారు.కానీ రఘురామ తాను ఎప్పుడూ పార్టీ మారలేదని.. తమ పార్టీ మంచి కోసమే తాను సలహాలిస్తున్నానని చెబుతూ ఉండేవారు. ప్రభుత్వం  వేరు పార్టీ వేరని.. ప్రభుత్వంపైనే తను విమర్శలు చేస్తున్నానని వాదించేవారు. 


ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ 


రఘురామ విమర్శలతో సీఐడీ అధికారులు ఆయన పుట్టిన రోజున కేసులు పెట్టి అరెస్టు చేశారు. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సుమోటోగా కేసు పెట్టి అరెస్టు చేశారు. అప్పుడే ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విషయంలో ఇటీవల ఆయన గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. విచారణ జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడం.. ఆయన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో రాజకీయం మారిపోయింది. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఇక జగన పై విమర్శలు చేయబోనని ప్రకటించారు. ఆయన రాజకీయ విధానాల్ని మాత్రం వ్యతిరేకిస్తానన్నారు. అయితే ఆయనను రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తూండటంతో ఆయనకు పంచ్‌లు వేసే అవకాశాన్ని వారే ఇస్తున్నట్లవుతోంది.