Sharmila criticized Andhra and Telangana : ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. గంజా, హెరాయిన్,కొకైన్ ఏది కావాలంటే అది దొరికే "ఉడ్తా ఆంధ్రప్రదేశ్ గా మారిందన్నారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే ఉన్నాయని మొదటి 5 ఏళ్లు TDP ,తర్వాత 5 ఏళ్లు YCP..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు.డ్రగ్స్ రవాణా,వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారు.25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే...తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు టీడీపి ,వైసీపీ,బీజేపీ వేసుకుంటున్నాయని మండిపడ్డారు.
ఆ మూడు పార్టీలకు సిగ్గుండాలి.కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా...వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి ? డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి "సేఫ్ హెవెన్" గా మార్చింది ?. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని CBI నీ కోరుతున్నాం. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు,పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో కొకైన్ పట్టుబడింది. ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేసిన సీబీఐ అధికారులు.. మరోసారి పరీక్షలు చేయనున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట 140 శాంపిల్స్‌ను పరీక్షించనున్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే కంటైనర్‌లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్‌లో ఈస్ట్ కొనుగోలు చేశామని.. కంటైనర్‌లో ఎలాంటి డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. కంటైనర్‌లో డ్రగ్స్ లేవని నిరూపిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.
డ్రగ్స్ కేసు విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ, వైసీపీలు రెండు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ బీజేపీని కూడా ఈ ఆరోపణల జాబితాలోకి తెచ్చింది. పురందేశ్వరి బంధువుల కంపెనీ అని ఆరోపిస్తున్నారు. అయితే తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో షర్మిల.. అసలు ఆ మూడు పార్టలదే తప్పని ఎదురుదాడి ప్రారంభించారు.