Three Family Memers Suicide in Kadapa District: కడప (Kadapa) జిల్లాలో శనివారం తీవ్ర విషాదం జరిగింది. రెవెన్యూ అధికారులు తమను మోసం చేశారంటూ ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట  (Ontimitta) మండలం కొత్త మాధవరంలో నివాసం ఉంటున్న పాల సుబ్బారావు (47)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో చదువుకుంటుండగా.. చేనేత పని చేసుకుంటూ సుబ్బారావు, భార్య పద్మావతి (41), చిన్న కుమార్తె వినయ (17)తో కలిసి ఆయన గ్రామంలో ఉంటున్నారు. ఆయనకు గ్రామంలో 3.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి రైతు భరోసా డబ్బులు సైతం అందుకునేవారు. అయితే, ఇటీవల పొలాన్ని అమ్ముదామని యత్నించగా రికార్డులు తారుమారయ్యాయి. అతని పొలం వేరే వారి పేరు మీద రికార్డులతో ఉంది. ఈ భూమిని తిరిగి తన పేరు మీద మార్చుకోవడానికి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కింద పడి బలవన్మరణం చెందగా.. అతని భార్య, కుమార్తె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.


సూసైడ్ నోట్ లభ్యం


సమాచారం అందుకున్న సీఐ పురుషోత్తమరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సూసైడ్ నోట్ గుర్తించారు. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా.. రికార్డులు తారుమారయ్యాయని పేర్కొన్నారు. పొలం వేరే వారి పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని.. ఏమీ చేయలేని స్థితిలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో రాసి ఉంది. కాగా, ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Srikakulam News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి దాడి- ఇద్దరు మృతి, మరో మహిళకు తీవ్రగాయాలు