Tiger Shroff Announces Baaghi 4: బాలీవుడ్‌లో యంగ్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. టైగర్ చేసినట్టుగా ఇంకా ఏ ఇతర హీరో యాక్షన్ చేయలేడని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు టైగర్. తను హీరోగా పరిచయమయ్యి పదేళ్లు అయ్యాయి. అయితే ఈ పదేళ్లలో తను నటించిన ఒరిజినల్ కథల సినిమాలకంటే రీమేక్సే ఎక్కువ. అలా రీమేక్స్‌తోనే ‘బాఘీ’ అనే ఒక మూవీ ఫ్రాంచైజ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో సినిమా రానుందని టైగర్ అనౌన్స్ చేయగా ఈసారి ఏ సౌత్ సినిమా బలైపోతుందో అని నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు.


రీమేక్స్‌తోనే హిట్స్..


‘హీరోపంతి’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు టైగర్ ష్రాఫ్. ఇది ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పరుగు’ సినిమా రీమేక్. ఇందులో హీరోగా అల్లు అర్జున్ చేసిన పాత్రను రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ నటించాడు. హీరోయిన్‌గా కృతి సనన్.. తనతో జోడీకట్టింది. ఆ తర్వాత ‘బాఘీ’ అనే చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించాడు. అది తెలుగులో ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ చిత్రానికి రీమేక్. ఆ తర్వాత తను కొన్ని ఒరిజినల్ చిత్రాల్లో నటించినా కూడా అవి తనకు అంతగా హిట్‌కు తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో మరోసారి అడవి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ అనే థ్రిల్లర్ మూవీని ‘బాఘీ 2’ పేరుతో రీమేక్ చేశాడు టైగర్. ఇలా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్‌తోనే తను హిట్లు అందుకున్నాడు.


రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..


2020లో ‘బాఘీ’ ఫ్రాంచైజ్ నుండి చివరి మూవీ రిలీజ్ అయ్యింది. అదే ‘బాఘీ 3’. ఇది కూడా ఒక సౌత్ సినిమాకు రీమేకే. తమిళంలో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘వెట్టాయ్’ చిత్రాన్ని ‘తడాఖా’ పేరుతో నాగచైతన్య, సునీల్.. తెలుగులో రీమేక్ చేశారు. అదే సినిమాను ‘బాఘీ 3’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు టైగర్ ష్రాఫ్. అలా ‘బాఘీ’ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు విడుదలయిన సినిమాలన్నీ రీమేక్‌లే. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుండి నాలుగో చిత్రం రానుందని టైగర్ ష్రాఫ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అంతే కాకుండా ‘బాఘీ 4’ 2025లో విడుదల అవుతుందని కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా దేనికి రీమేక్ అయ్యింటుంది అని ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.






అనవసరమైన యాక్షన్..


‘వర్షం’, ‘క్షణం’, ‘తడాఖా’.. ఈ మూడు సినిమాల్లో మితిమీరిన యాక్షన్ ఏమీ ఉండదు. కానీ టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు కాబట్టి వాటిని రీమేక్ చేసిన మేకర్స్ మాత్రం స్టోరీని ఇష్టం వచ్చినట్టుగా మార్చి.. అందులో యాక్షన్‌తో నింపేశారు. దీంతో ఒరిజినల్‌గా ఈ సినిమాలను ఇష్టపడిన సౌత్ ప్రేక్షకులు.. రీమేక్స్ విషయంలో విమర్శలు కురిపించారు. అందుకే టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వగానే అందరూ ఒక్కసారిగా ఈసారి ఏ సినిమా బలైపోతుందో అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక ‘బాఘీ 4’ కోసం సాజిద్ నడియాద్వాలాతో చేతులు కలపనున్నాడు టైగర్ ష్రాఫ్.


Also Read: బ్లాక్ బస్టర్ ‘జవాన్‘కు సీక్వెల్ - అదిరిపోయే హింట్ ఇచ్చిన అట్లీ