Delhi Liquor Policy Case Updates: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ఆప్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అరెస్ట్‌ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఢిల్లీ మంత్రి అతిషి కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ఆయనను అరెస్ట్ చేశారని మండి పడ్డారు. ఒక్క వ్యక్తి స్టేట్‌మెంట్‌ని ఎలా ఆధారంగా పరిగణిస్తారని ప్రశ్నించారు. అంతే కాదు. శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 4.5 కోట్లు విరాళం ఇచ్చాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
"కేవలం శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన కాసేపటికే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా శరత్ బీజేపీకి రూ.4.5 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇదంతా ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో భాగమే. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరవాత బీజేపీకి రూ.55 కోట్ల విరాళాలు అందాయి. ఈ డబ్బంతా బీజేపీ బ్యాంక్ అకౌంట్‌కే వెళ్లింది. ఈడీ కచ్చితంగా జేపీ నడ్డాని అరెస్ట్ చేయాలి. మొదటిసారి ఈ లిక్కర్ పాలసీ కేసులో ఈ కుంభకోణం బయటపడింది. ఇప్పటి వరకూ ఎవరి నుంచీ ఎలాంటి ఆధారాలు సేకరించలేదు"
- అతిషి, ఢిల్లీ మంత్రి
2021 నవంబర్‌కి ముందు ఈడీ ఫిర్యాదు మేరకు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో 5 జోన్స్‌లో లిక్కర్ వెంట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వచ్చిందని వివరించారు అతిషి. లిక్కర్ పాలసీ 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ పాలసీ అమల్లో ఉన్నప్పుడే బీజేపీకి అరబిందో కంపెనీ నుంచి రూ.3 కోట్ల విరాళం వచ్చినట్టు ఆరోపించారు అతిషి. అదే నెలలో మరో కోటిన్నర ఇచ్చినట్టు చెప్పారు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే చేశారని ఆరోపించారు.