ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ సారి లాయర్ల కోటాలో ఏడుగురిని న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 29వ తేదీన సమావేశం అయింది. ఇందులో ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకంపై సిఫార్సులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బడ్జెట్‌పై ఎన్నికల ప్రభావం నిజమే..! ప్రతిపక్షాలకు మోదీ ఏం పిలుపునిచ్చారంటే!!
న్యాయవాదులుగా పని చేస్తూ న్యాయమూర్తులుగా అవకాశం పొందేందుకు కొలీజియం సిఫార్సు చేసిన జాబితాలో ఉన్న వారు కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత. వీరంతా ప్రముఖ లాయర్లుగా.. న్యాయకోవిదులుగా గుర్తింపు పొందారు. గతేడాది నవంబర్‌లో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. న్యాయవాది కె.మన్మథరావు, న్యాయాధికారి బీఎస్ భానుమతిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో వారిద్దరు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
తాజాగా మరో ఏడుగుర్ని కొలీజియం సిఫారుసు చేసింది. రాష్ట్రపతి, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వీరు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. విరివిగా న్యాయమూర్తుల నియామకలు చేపడుతున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను యమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగుర్ని న్యాయమూర్తులుగా గత ఏడాది సెప్టెంబర్లో నియమించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైకోర్టును కూడా విభజించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్న న్యాయమూర్తులను రెండు హైకోర్టులకు కేటాయించారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ మానవ వనరుల కొరత నిరోధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తూండటంతో సమస్య పరిష్కారం అవుతోంది.