విశాఖపట్నం నగరంలో మరోసారి డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది. స్థానిక ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక యువతితో పాటు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిది హైదరాబాద్ కాగా, యువకుడిది విశాఖగా గుర్తించారు. టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండీఎంఏ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమికులని పోలీసులు గుర్తించారు. ప్రేమికుడు హేమంత్ కోసం ప్రియురాలు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ప్రేమతో తెచ్చినట్టు తెలుస్తోంది.


విశాఖపట్నంలోని మర్రిపాలెం గ్రీన్‌ గార్జెన్స్‌కు చెందిన యువకుడు, హైదరాబాద్‌కు చెందిన యువతికి కొంతకాలంగా పరిచయం ఉంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి యువతి డ్రగ్స్‌తో వస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో ఎన్‌ఏడీ వద్ద నిఘా పెట్టారు. ఎన్‌ఏడీ దగ్గర వాహనం దిగిన యువతిని విశాఖ యువకుడు కలిసి.. ఆమె దగ్గర ఉన్న డ్రగ్స్‌ ట్యాబెట్లను తీసుకున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన పోలీసులు వారిపై దాడిచేసి ఇద్దరిని పట్టుకున్నారు. 


వీరి నుంచి మొత్తం 18 ట్యాబెట్లను, ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు. యువతి, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రియుడి కోసం యువతి డ్రగ్స్‌ను హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చిన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల నగరంలో కొంత మంది యువత దగ్గర డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో కలకలం రేగింది. కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్ దందా బయటపడిన సంగతి తెలిసిందే. 


భారత్‌లో డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారి అయిన టోనీ విచారణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులపాటు విచారణ జరిపిన పోలీసులు.. రెండు రోజుల విచారణలో రాబట్టిన వివరాల ఆధారంగా.. నేడు విచారణను కొనసాగించనున్నారు. మొదటి రోజు 5 గంటల పాటు సాగిన విచారణ, రెండో రోజు 4గంటలు సాగింది. ఇతణ్ని హైదరాబాద్ పోలీసులు ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టోనీ ఉపయోగించిన 2 సెల్ ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ సెల్ ఫోన్లలోని కాంటాక్ట్స్ జాబితాను ఫోరెన్సిక్ నిపుణులు రిట్రైవ్ చేసినట్లు సమాచారం. ఈ డేటాతో డ్రగ్స్ తీసుకున్న వ్యాపారుల జాబితాను పోలీసులు బయటకు తీస్తున్నారు.