మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధలకు విద్యార్థి నాయకుల నుంచి చేదు అనుభవం అనుభవం ఎదురైంది. వారు రాజీనామా చేయాలని విద్యార్థి నాయకుడు ముఖం మీదే డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించకపోతే దళిత ఓటు బ్యాంకుతో నెగ్గిన ప్రజాప్రతినిధులు అవసరమైతే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ నాయకుడు రేవు తిరుపతిరావు.. మంత్రి, ఎంపీ ముఖంమీదే చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రి వినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేయనున్న కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న నినాదంతో అమలాపురంలో నిర్వహించిన విజ్ఞావనా దీక్షలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 


స్థానిక గడియారస్తంభం వద్ద ఆదివారం కోనసీమ వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా 12 గంటల విజ్ఞావన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థి సంఘ నాయకుడు తిరుపతిరావు అవసరమైతే రాజీనామా చేయాలన్న మాటతో ఈ పరిణామానికి వేదికపైనున్న మంత్రి, ఎంపీ తోపాటు పలువురు నాయకులు షాక్ అయ్యినంత పని అయ్యింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను ముఖంపైనే ఇలా అనకూడదంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. 


ఒక దశలో మంత్రి విశ్వరూప్ అనుచర వర్గం దీనిపై వ్యతిరేకిస్తూ మాట్లాడడంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే తిరుపతిరావు మాట్లాడిన విషయంపై కూడా కొందరు ఏమాత్రం వెనకు తగ్గలేదు. దీంతో మంత్రి విశ్వరూప్ మైక్ తీసుకుని న్యాయమైన కోర్కెలను న్యాయబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆలోచన చేయాలే తప్ప ఈ విధంగా మాట్లాడవద్దని, ఏ ఒక్క వర్గం, ఏ సామాజిక వర్గం కానీ కులం పేరుతో ఏదీ సాధ్యం కాదని డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ అన్నారని మంత్రి అన్నారు. ఈ విధంగా మీరు ఆర్గనైజింగ్ చేస్తున్నప్పుడు తానేమీ సాధించలేనని, ఏదైనా ఒక సిస్టమేటిక్ గా చేయాలని హితవు పలికారు. ఇక్కడి వచ్చిన నూటికి 90 మంది తన అభిమానులున్నారని, ఒక మంత్రిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం తీసుకువెళ్తానని అన్నారు. అంతేకానీ ఈ విధంగా మాట్లాడితే ఏమీ అయిపోదని మంత్రి అనగానే.. పక్కనుంచి ఏం ఫరవాలేదు.. ఏమైపోదులేండి అంటూ సైటైర్లు వేశారు మరికొందరు దళిత నాయకులు. 


దీంతో అంతా ఐక్యంగా పోరాడి న్యాయమైన కోర్కెను సాధించుకునేందుకు ప్రయత్నిద్దామని మంత్రి విశ్వరూప్ తన ప్రసంగాన్ని ముగించారు. ఎంపీ అనురాధ మాట్లాడుతూ అంబేడ్కర్ కేవలం మనకే చెందిన మనిషి కాదని, ఆయన ఒక మహానుభావుడని అన్నారు. మనందరం ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం కాదని.. ఎంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, కాబట్టి శాంతియుతంగా మనకు కావాల్సింది సాధించుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మేమందరం మీతో ఉన్నామని చెబుతున్నామని అన్నారు. ఈ గందరగోళానికి అంతకు ముందు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, టీడీపీ నాయకుడు, రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఇతర సామాజిక వర్గాల నాయకులు తదితరులు హాజరై విజ్ఞావన దీక్షకు మద్దతు తెలిపారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ తో నిర్వహించిన విజ్ఞాపనా దీక్షకు కోనసీమ వ్యాప్తంగా పార్టీలకతీతంగా దళిత సంఘాల నాయకులు, ఆయా పార్టీల నాయకులు హాజరుకాగా ఎక్కువ మంది మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమంటూ అసహనం వ్యక్తం చేశారు.