MP GVL  Question Center :  విశాఖ స్టీల్ ప్లాంట్ (  Vizag Steel Plant ) ఉద్యోగులకు జీతాల చెల్లింపుల ఆలస్యంపై పార్లమెంటులో కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని పార్లమెంటులో ప్రశ్నించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.     గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాల చెల్లింపులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనీ ఆలస్యానికి గల కారణాలను చెప్పాలని  ఉక్కు శాఖ మంత్రికి ప్రశ్న వేయడంతో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  సాధారణంగా ఉద్యోగులకు నెలకు జీతం చెల్లింపులు తరువాతి నెల మొదటి రోజున చేయబడతాయనీ ఈ సంవత్సరం సెప్టెంబరు, మరియు అక్టోబర్ నెలల్లో ద్రవ్యత (liquidity) పరిమితుల కారణంగా జీతాల చెల్లింపులు తరువాతి నెల మొదటి వారంలో చేయబడ్డాయనీ మంత్రి సమాధానమిచ్చారు.                        


ఎంపీ   జీవీఎల్ అడిగిన మిగిలిన ప్రశ్నలకు సమాధానంగా ఉక్కు మంత్రి కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ రిజర్వేషన్ మార్గం ద్వారా ఐరన్ ఓర్ బ్లాక్‌ను కేటాయించాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిందనీ, అదనంగా, ఆర్‌ఐఎన్‌ఎల్ ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి  వ్యయాల తగ్గింపు, మరియు  ఉక్కు ఉత్పత్తి మరియు విక్రయాలలో  పెరుగుదలను సాధించడానికి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి మిశ్రమాన్ని ఆప్టిమైజేషన్ చేయడం, ఖర్చులను తగ్గించడానికి బొగ్గు మిశ్రమంలో స్వదేశీ కోకింగ్ బొగ్గు శాతాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలియచేశారు.                          


విశాఖ స్టీల్‌ప్లాంటు ఏర్పాటైనప్పటి నుంచి ఏ నెలకు ఆ నెల చివరి రోజున జీతాలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంటే జనవరి నెల జీతం... ఆ నెల 31నే ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ రోజు సెలవు వస్తే 30నే చెల్లిస్తారు. ఇప్పుడు జీతాలివ్వలేని దుస్థితి వచ్చింది. ప్లాంటులో అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 14,500 మంది ఉన్నారు. వీరికి జీతాల కోసం నెలకు రూ.80 కోట్లు కావాలి. ఇటీవలి కాలంలో స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గింది.  మరోవైపు యాజమాన్యం ఐరన్‌ఓర్‌ కోసం టెండర్లు పిలిచింది. వాటిని ఖరారు చేసి, నగదు చెల్లించాలి. దానికి కూడా డబ్బులు కావాలి. నెలకు ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితేనే ప్లాంటులో అన్నీ సవ్యంగా సాగుతాయి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.                    


కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకొచ్చి స్టీల్‌ ఉత్పత్తులు కొనాలని.. అడ్వాన్స్‌గా రూ.2వేల కోట్లు సర్దుబాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఈ కారణంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టంగా మారుతోంది. అయితే ప్రైవేటీకరణ చేయడానికే ఇలా చేస్తున్నరన్న వాదన కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది. జీతాల సమస్యపై  జీవీఎల్ సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.