Heavy Rains in AP Due to Michaung Cyclone: మిగ్ జాం తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమవుతోంది. తిరుపతి జిల్లాలోని చిట్టేడులో అత్యధికంగా 39 సెం.మీల వర్షపాతం నమోదైంది. చిల్లకూరులో 33, నాయుడుపేట 28.7, ఎడ్గలి 24, బాపట్ల 21, మచిలీపట్నం 14.9 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల 10 సెం.మీల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.




తిరుపతిలో తప్పిన ప్రమాదం


మిగ్ జాం ప్రభావంతో గత 3  రోజులుగా కురుస్తోన్న వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. సోమవారం రాత్రి చెన్నరెడ్డి కాలనీలో ఓ భవనం కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే సమయంలో భవనం ముందు పార్క్ చేసి ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25.1హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. యాదమరి, కార్వేటినగరం, పులిచెర్ల, పలమనేరు, శ్రీకాళహస్తీ, నాగలాపురం, సత్యవేడు, తిరుపతి, చిత్తూరు, గుడిపాల, పలమనేరు,పెనుమూరు వంటి ప్రాంతాల్లో అధికంగా పంట నష్టం వాటిల్లే‌ ప్రభావం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పెనుమూరు మండలం,‌ కల్వకుంట్ల ఎన్టీఆర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తి వేశారు. నీవా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మల్లెమడుగులో నీటి ఉద్ధృతితో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.



అటు, తిరుమలలోని పాంచజన్యం అతిథి గృహం దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో చెట్ల కింద ఉన్న 4 వాహనాలు ద్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించి వాహనాలు వెలికితీశారు. పాప వినాశనం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వంటి‌ సందర్శనీయ ప్రదేశాలకు భక్తులను తాత్కాలికంగా అనుమతించడం లేదు.


డ్యాంలు కళకళ


మిగ్ జాం ప్రభావంతో భారీ వర్షాల కారణంగా తిరుమలలోని 5 ప్రదాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, పసుపుధార, కుమారధార, గోగర్భం డ్యాంలు పూర్తిగా నిండాయి. వరద నీరు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఉద్ధృతం వచ్చి చేరుతుండడంతో పాప వినాశనం డ్యాం పూర్తిగా నిండి‌పోయింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే‌ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


సహాయక చర్యలు ముమ్మరం


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 211 సహాయక శిబిరాల్లో  సుమారు 9,500 మందిని తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరు - కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి తుపాను ప్రభావం కాస్త తగ్గుతుందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.


Also Read: AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?