అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుంతకల్లు-బళ్లారి 67వ జాతీయ రహదారి మీద ఈ ఘటన చోటుచేసుకుంది. విడపనకల్లు మండలం దొనేకల్లు గ్రామ శివార్లలోని నిర్మాణం లో ఉన్న బ్రిడ్జిపై నుంచి ఓ కారు చిన్నపాటి చెరువులోకి దూసుకెళ్లింది. సుమారు 40 నుంచి 50 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది.. దాని మీద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు.
అయితే ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే.. గుంతకల్ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చీకటి పడటంతో కాస్త ఇబ్బందిగా మారింది. చుట్టుపక్కల గ్రామాస్థులు కూడా.. ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
అనంతపురం జిల్లాలో... మరో ఘటన
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి వద్ద ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మృతి చెందారు. మరో రైతు ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. మేడాపురం నుంచి ధర్మవరం కూరగాయల మార్కెట్కు ఆటోలో కూరగాయలు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. పొగమంచు కారణంగా రహదారి కనిపించక.. ఈ ప్రమాదం జరిగినట్టు.. తెలుస్తోంది. ఈ కారణంగానే ఆటో అదుపుతప్పి కిందపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ధర్మవరం గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.