RIL to pump Rs 65,000 cr into Andhra Pradesh for 500 biogas plants: ఆంధ్రప్రదేశ్‌లో రూ. 65వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. ఈ నిధులతో మొత్తం ఐదు వందలకుపైగా బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టనున్నారు. క్లీన్ ఎనర్జీ ఇనీషియేటివ్‌లో భాగంగా రిలయన్స్ వచ్చే ఐదేళ్ల కాలంలోనే ఈ మొత్తాన్ని ఏపీలో పెట్టుబడులుగా పెట్టనుంది. గుజరాత్‌ బయట ఇప్పటి వరకూ ఈ రంగంలో ఇంత పెద్ద మొత్తంలో రిలయన్స్ ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు. ఈ పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూను కూడా చేసుకున్నారు. 


ఐదేళ్లలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు                 


ఒక్కో ప్లాంట్ ను 130 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. నిరుపయోగమైన  భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాంట్ల వల్ల రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తరపున ఇటీవల రిలయన్స్ బృందంతో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇంధన రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ అంగీకరించింది. వెంటనే.. ఎంవోయూ కూడా చేసుకున్నారు. వచ్చే ఐదేళ్లలోనే ఈ పెట్టుబడులను రిలయన్స్ పెట్టనుంది.         


Also Read:  బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్


సోమవారమే చంద్రబాబుతో పెట్టుబడులపై చర్చిచిన టాటా గ్రూప్ ప్రతినిధులు                               


సోమవారం రోజున టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అమరావతికి వచ్చారు. చంద్రబాబుతో సమావేశం అయ్యారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 40వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇలా టాటా గ్రూపు హోటల్స్ విభాగం తరపున ఇరవై స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖలో  పది వేల మంది ఉద్యోగుల సామర్థ్యంతో క్యాంపస్‌ను పెట్టాలని టాటా గ్రూపు నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల్లో ఇది ప్రారంభం కానుంది.         


Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?


  పెట్టుబడుల కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం                 


ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం వైపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు బడా సంస్థలు తాము పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని ప్రకటించాయి. ప్రస్తుతం అవి ఒప్పందాల వరకూ వస్తున్నాయి. ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏపీ యువతకు లభించే అవకాశం ఉంది.