ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు హైకోర్టులోకాస్త రిలీఫ్ లభించింది. ప్రభుత్వం ప్రకటించి న పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న "జీతాల రికవరీ" అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది. 


అయితే ప్రభుత్వం  జీతాలు తగ్గబోవని చెబుతోంది. రికవరీ చేసినప్పటికీ జీతాలు తగ్గవని హామీ ఇస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను తక్కువగా నిర్ణయించడం.. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం, ఇప్పటికే ఇచ్చిన ఐఆర్ నుంచి నాలుగు శాతం వెనక్కి తీసుకోవడం వంటి చర్యల వల్ల తగ్గిపోయే ఉద్యోగుల జీతాన్ని పెండింగ్‌లో పెట్టిన డీఏలన్నింటినీ మంజూరు చేయడం ద్వారా కవర్ చేయాలని నిర్ణయించింది. నిజానికి డీఏలకు పీఆర్సీకి సబంధం లేదు. కానీ ప్రభుత్వం తమ పీఆర్సీ ఉద్యోగులకు నష్టం లేదన్న భావన కలిగించడానికి డీఏలను పీఆర్సీలో కలిపి ప్రకటించింది. దీంతో ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయ్యే రికవరీ తక్కువే. కానీ డీఏల రూపంలో రావాల్సిన ప్రయోజనాలన్నీ పోతాయి. 


ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఉద్యోగులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఈ పీఆర్సీ ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రెండు సార్లు విచారణ వాయిదా పడింది. ఇవాళ డివిజనల్ బెంచ్ ముందు విచారణ జరిగింది. జీతాల రికవరీ  వద్దని హైకోర్టు చెప్పడంతో ఉద్యోగులకు డీఏ ఎరియర్స్  వచ్చే అవకాశం ఉంది.