ఆ తీగలు మీటితే వచ్చే సప్త స్వరాలు మనసులను అలరిస్తాయి. ఆ వీణల నుంచి వచ్చే సంగీతం మైమరిపిస్తుంది. సంగీత వాయిద్యాల యవనికలో ఈ వీణలది ప్రత్యేక స్థానం. ఇంతకీ ఏవి అనుకుంటున్నారా.?. అదేనండీ. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలు. బొబ్బిలి ప్రాంతంలోని గొల్లపల్లి ఈ వీణల తయారీకి ప్రత్యేక కేంద్రం.
మరో అరుదైన గుర్తింపు
బొబ్బిలి వీణలు ఇప్పటికే రాష్ట్రపతి భవన్ నుంచి వైట్ హౌస్ వరకూ ప్రత్యేక గుర్తింపు పొందగా, వీటికి ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు లభించింది. 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి)కు పథకం అవార్డుకు నామినేట్ కావడంతో మరోసారి తన ఖ్యాతి నిలబెట్టుకోగలిగింది. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా టీం వెరిఫికేషన్ కోసం బొబ్బిలిలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం పర్యటించారు. టీం సభ్యులు వీణల తయారీ దారులతో మాట్లాడారు. వీటి తయారీ సహా అక్కడి వారి జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. వీణలతో పాటు దీనికి అనుబంధంగా మరిన్ని ఉత్పత్తులను తయారు చేయగలిగే నైపుణ్యాన్ని కళాకారులు పెంపొందించుకోవాలన్నారు. ఇందు కోసం సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి
గొల్లపల్లి వీణలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక్కడ సంగీత అభిమానులను అలరించే సరస్వతీ వీణల నుంచి చిన్న చిన్న బహుమతుల వీణల తయారీ వరకు ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి వీణలు నేడు ప్రపంచం నలుమూలలకు సరఫరా కావడం సహా, బొబ్బిలి చరిత్రను ఖండాంతరాల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి. అంతే కాకుండా తెలుగు వారికి, తెలుగు నేలకు గర్వ కారణంగా నిలిచాయి.
తయారీయే ప్రత్యేకం
మైసూర్, తంజావూరు వీణలు 3 చెక్కలతో తయారు చేస్తే బొబ్బిలి వీణలు మాత్రం ఇక్కడి వడ్రంగులు ఒకే చెక్కతో తయారు చేస్తారు. అందుకే ఇవి ఇంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పనస చెట్టు కలపను ఏకండీ కర్రతో అద్భుతమైన చేతి పనితో ఈ వీణలను తయారు చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు.
గత వైభవం చూస్తే
దేశ, విదేశాల్లోనూ బొబ్బిలి వీణ రాగాలు మార్మోగుతూనే ఉంటాయి. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలతో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రతిష్టాత్మకమైన జీ20 సభ్య దేశాల సమావేశాల్లో సైతం బొబ్బిలి వీణ తన వైభవాన్ని చాటింది. జీఐ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకున్న పేరు మరే వీణలకు లేదనే చెప్పాలి.
నైపుణ్యం వెనుక కథ
సుమారు 300 ఏళ్ల క్రితం బొబ్బిలి సంస్థానాదీశులు మైసూరును సందర్శించారు. ఆ సమయంలో అక్కడి రాజ దర్బారులో వీణా కచేరీ తిలకించారు. ఈ క్రమంలో వీణా మాధుర్యంతో పాటు వాటిని తయారు చేసిన వడ్రంగుల నైపుణ్యం కూడా వారిని ఎంతో ఆకర్షించింది. వీటిని బొబ్బిలిలోనూ తయారు చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించారు. వారు మైసూరులో మెళకువలు నేర్చుకోగా, వారి వంశీయులు నేటికీ బొబ్బిలిలో వీణలు తయారు చేస్తున్నారు.