తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానల బెడద లేకుండా, ఈసారి 'యాసంగి' సీజన్ ముందుకు జరిపించాలని ప్రభుత్వం భావించినా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.  వానాకాలం సీజన్ అయినా వర్షాలు లేకపోవడం వల్ల 'యాసంగి'ని ముందుకు జరపడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో వచ్చే యాసంగి సైతం ఎప్పటిలాగానే సాగనుంది. వ్యవసాయ శాఖ సైతం డిసెంబర్ నుంచి 'యాసంగి'కి సన్నద్ధమవుతోంది. 


గత మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షాలతో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. అందులో 4 లక్షల ఎకరాల్లో వరి ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వానాకాలం, 'యాసంగి' సీజన్ ముందుకు జరపాలని భావించారు. కనీసం నెల రోజులైనా ముందుకు జరిపితే రైతులకు నష్టాలు తగ్గుతాయని భావించారు. 


మంత్రివర్గ ఉపసంఘం


యాసంగి, వానాకాలం సీజన్ ముందుకు జరపాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సన్నద్ధత కోసం వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైతు వేదికల ద్వారా ప్రచారం సైతం చేసింది. యాసంగి సాగులో యాజమాన్య పద్ధతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగు తదితర అంశాలపై రైతులకు వ్యవసాయ నిపుణులు సూచనలు సైతం చేశారు. అయితే, జూన్ లో తీవ్ర వర్షాభావం నెలకొంది. జులైలో వర్షాలు ప్రారంభమై, నాట్లు మొదలయ్యాయి. తర్వాత ఆగస్టులో వర్షాలు కురవలేదు. మళ్లీ సెప్టెంబరులో వర్షాలు పడ్డాయి. అయితే, చీడపీడల సమస్యలు తలెత్తాయి. 


పంట కోతలు ప్రారంభం


ప్రస్తుతం వానాకాలం సీజన్ వరి పంట చివరి దశకు వచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కోతలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ నవంబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


యాసంగి సీజన్ ఎప్పుడంటే.?


డిసెంబర్ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవలే సీజన్ సన్నాహాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు.


కొనుగోళ్లు ఎప్పుడంటే.?


తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు డిసెంబర్ రెండో వారం నుంచి ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది. కాగా, రైతులకు పూర్తి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రారంభం నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది.


పెరిగిన సాగు విస్తీర్ణం


కాగా, గతేడాదితో పోలిస్తే యాసంగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం రెట్టింపైంది. తెలంగాణలో నీటి సరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. సకాలంలో పంట కొనుగోళ్లతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పారు.